Wednesday, November 20, 2024

BRS Press Meet – క‌ష్టమంతా ద‌ళారుల పాలు – ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్​రెడ్డి

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రైత‌న్న‌ల ఆగ‌చాట్లు
మ‌ద్ద‌తు ధ‌ర‌కే దిక్కులేదు..ఇక బోన‌స్ మ‌ర్చిపోవ‌డమే
కొనుగోలు కేంద్రాలు సౌకర్యాలు నిల్​
కాంటా, తాలు పేరుతో మోసాలు
ఎక్క‌డా క‌న‌ప‌డ‌ని మంత్రులు
ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వర్​రెడ్డి ఆగ్ర‌హం

హైదరాబాద్ – రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు . దళారులు రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ దేవుడెరుగు, పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న పార్టీ నేతలు గండ్ర వెంకట రమణారెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం ఆదేశించినా క్వింటాల్‌కు రూ.30 మాత్రమే పెంచారని విమర్శించారు. రైతులకు అన్యాయం జరిగిందని అధికారులే ఒప్పుకున్నారని చెప్పారు. వడ్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్కవ ధర ఇచ్చారని తెలిపారు. జనగామలో 193 కొనుగోలు కేంద్రాలు పెట్టారని, అందులో ఒక్కటి కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని విమర్శించారు.

మ‌ద్ద‌తు ధ‌ర కంటే తక్కువకే…

ఎన్నికల ముందు క్వింటా ధాన్యంకు రూ.2500కు కొంటామని రేవంత్‌ రెడ్డి చెప్పారని, రూ.500 బోనస్ కూడా ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కనీస మద్దతు ధరకంటే రూ.700 తక్కువకు వడ్లు కొంటున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలను మంత్రులు కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రైతుబంధు ఇస్తామని మంత్రులు అంటున్నారని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం పోయిందని చెప్పారు. రైతుబంధు, రుణమాఫీ ఇవ్వలేదు కాబట్టే రైతులు ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీస మద్దతు ధరకు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్ ఎక్క‌డ?

కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు. మండుటెండలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కరోనా సమయంలో కూడా వడ్లు కొని 10 రోజుల్లోనే రైతుల అకౌంట్స్‌లో డబ్బులు వేసిన ఘనత కేసీఆర్‌ది అని అన్నారు. ఇప్పుడు మంత్రులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సివిల్ సప్లయ్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష కూడా చేయడం లేదని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రైతుల కంటే ఎక్కువ మిల్లర్ల గురించి బాగా తెలుసని సెటైర్ వేశారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, ధాన్యం క్వింటాకు రూ.2200 చెల్లించాలని, రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement