న్యూ ఢిల్లీ – ఎమ్మెల్యేల అనర్హత కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పీకర్ నేటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్ లు నేడు దాఖలు చేసింది.. 10మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ తన పిటిషన్ లో పేర్కొంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్ఎల్‌పీ దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
కాగా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ పిటిషన్లు దాఖలు చేసేందుకు నేడు ఢిల్లీకి వెళ్లారు.. ముందుగా, అక్కడ పార్టీ కార్యాలయంలో ఉన్న లీగల్ టీమ్ తో చర్చలు జరిపారు.. అలాగే హరిశ్ ఇతర సీనియర్ న్యాయవాదుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం రెండు పిటిషన్లు పార్టీ న్యాయవాదుల ద్వారా సుప్రీంకోర్టులో దాఖలు చేయించారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీలోకి మారారు. బీఆర్ఎస్ బీ ఫారం మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన వీరందరినీ అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టుకు వెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్ట్ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు.
సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరం తెలుపుతూ.. శాసనసభ సెక్రెటరీ హైకోర్ట్ ప్రత్యేక బెంచ్ కి అప్పీల్ చేయగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ కు ఉందని, టైమ్ బౌండ్ ఏమీ లేదని తీర్పు ఇచ్చింది. కాగా ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంలో నేడు రెండు పిటిషన్లు దాఖలు చేశారు.. కారు గుర్తుపై గెలిచి హస్తం పార్టీలో చేరిన 10మందిని అనర్హులుగా ప్రకటించాలని ఈ పిటిషన్ లో కోరారు.