దేవరకద్ర – పాలుగారే పాలమూరును కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పాలమూరు ఆకలి దప్పులతో అలమటిస్తుంటే … కొన్ని రాజకీయ పార్టీలు అంబలి కేంద్రాల్లో గంజీనీళ్లు పోస్తే కాలం గడిపే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ తీపుకువచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ధ్వజమెత్తారు..మనం ఇలాంటి పార్టీలను గెలిపిద్దామా? ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీలు గెలిపించాలో ఆలోచించాలని పిలుపు ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎం కేసీఆర్ పయనించే హెలికాప్టర్లో స్వల్ప సాంకేతిక లోపం కారణంగా ఈ కార్య్రకమానికి కేసీఆర్ ఆలస్యంగా వచ్చారు. ఆ తరువాత నారాయణ్‌పేట్, గద్వాల సభల్లో పాల్గొనాల్సిన స్థితిలో కేసీఆర్ .. దేవర కద్రలో రాజకీయ పార్టీల జోలికి వెళ్లకుండా మహబూబ్‌నగర్ జిల్లాలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పాలమూరు ప్రజలకు దక్కాల్సిన తాగునీరు, సాగునీరు ఇవ్వలేదన్నారు. ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయలేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డ అంజయ్య జూరాల ప్రాజెక్టకు నడుముకట్టారని, కానీ ఆ పనిని ముందుకు సాగనీయలేదన్నారు.
సమైక్యాంధ్రాలో.. కాంగ్రెస్ పార్టీ పాలనలో పాలమూరు ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పొట్టకూటి కోసం వలవల ఏడుస్తూ వలసలు పోయే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూలు పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ఎత్తిపోతల పథకాలు, ప్రాజెక్టులతో సాగునీరు, తాగునీరుకు కొరత లేదన్నారు. పాలమూరు.. రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి కానున్నాయని, దేవరకద్ర నియోజక వర్గంలో ఇప్పటికే 99 వేల ఎకరాల భూమికి సాగునీరు అందుబాటులోకి వచ్చిందని, మిగిలిన ప్రాజెక్టులు పూర్తయితే లక్షాయాబై వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందన్నారు. దేవరకద్రలో అభివృద్ధికి ఆలె వెంకటేశ్వరరెడ్డి శ్రమిస్తున్నారని, ఈ సభకు ఇన్ని గంటలు ఎదురు చూశారంటే వేంకటేశ్వరరెడ్డి విజయం ఖాయమని తెలుస్తోందని, 50 వేల మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ దేవరకద్ర ప్రజలను కోరారు.