సిరిసిల్లా – కులం, మతం కాదు, గుణం చూసి ఓటెయ్యండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం. నేను పని చేస్తాను అనుకుంటేనే నాకు ఓటెయ్యండి అని కోరారు మంత్రి కేటీఆర్ . సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువకులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి.. గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి.. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే.. కానీ, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి’ అని ఆయన అన్నారు. నేతన్న ఆత్మహత్య వద్దంటూ రాతలు సిరిసిల్ల గోడలపై ఉండేవి.. సిరిసిల్లలో ఇన్ని విద్యాసంస్థలు వస్తాయని కళలో కూడా ఎవరూ అనుకోలేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అందరు సిరిసిల్ల, గజ్వేల్ లోనే అభివృద్ధి అంటుంటే, సిరిసిల్ల నాయకులు మాత్రం సిరిసిల్లలో అభివృద్ధి ఏం లేదని అంటున్నారు’ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
‘ కేసీఆర్ న్యాయకత్వం మానేరును సజీవ ధారగా మార్చింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నాం.. సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాల్లో పురోభివృద్ధి ని సాదిస్తున్నాం.. కాంగ్రెస్- బీజెపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటంలేదు.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే.. కుల, మతాల పేరుతో ముందుకు వస్తారని ఆయన మండిపడ్డారు. కులం, మతం కాదు గుణం చూసి ఓటెయ్యండి.. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం.. నేను పని చేస్తాను అనుకుంటేనే నాకు ఓటెయ్యండి.. సిరిసిల్ల చరిత్రలో మొదటి సారి 2014 సిరిసిల్ల ఎమ్మెల్యే కు మంత్రి పదవి వచ్చింది అని’ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
‘ ఇంతకష్టపడి సాదించుకుని.. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అవుతుండట, మెడమీద తల ఉన్నోడు ఎవడైనా ఇతడి చేతిలో రాష్ట్రాన్ని పెడతాడా అని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు దొంగ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవుతాడని గాంధీ ఆనాడే ఊహించాడు.. కాంగ్రెస్ దిక్కులేని స్థితిలో రాష్ట్రం ఇచ్చారు.. కానీ, ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు.. 55 ఏండ్లలో చేతకాలేదు కానీ, ఇప్పుడు అదిలేదు.. ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రూపాయల డిజీల్ 100 రూపాయలు, 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు దేవుడా నరేంద్ర మోడీ.. ఎలక్షన్ అన్నపుడు ఆగంకాకుండా ఆచితూచి అడుగులు వేయండి.. విజన్ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కడైనా ఉన్నాడా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. పని చేసే నేత చేతిలోనే రాష్ట్ర భవిష్యత్ భద్రంగా ఉంటుందని’ కెటిఆర్ ఓటర్లకు తెలిపారు.