హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: బీఆర్ఎస్ ఆవిర్భావంతో దేశ రాజకీయాల్లో ఓ కొత్త చర్చకు తెరలేపిన ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఖమ్మం బహిరంగ సభతో దేశ ప్రజల దృష్టిని మరల్చబోతున్నారు. యాభై ఏళ్ళకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో దేశంలో వేళ్ళూనుకుపోయిన ప్రధాన రాజకీయ పార్టీల దిమ్మదిరిగేలా పదునైన తన ప్రసంగంతో ఆకట్టు కోబోతున్నారు. 2001లో టీ-ఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కరీంనగర్లో నిర్వహించిన ‘సింహ గర్జన’ బహిరంగసభ స్వరాష్ట్ర ఆకాంక్షను ఏ స్థాయిలో ప్రతిబింబించిందో.. అదే రీతిలో ఈ నెల 18న ఖమ్మంలో ‘భారతగర్జన’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించి వెనుకబాటుకు గురవు తున్న దేశాన్ని ఏ విధంగా పురోగతి వైపు నడిపించాలో మార్గదర్శకం చేయబోతున్నారు. నాడు తెలంగాణ వెనుకబాటుతనాన్ని ఎత్తిచూపి, ఇక్కడి ప్రజల అవసరాలు, సాధించాల్సిన లక్ష్యాలను వెల్లడిస్తూ ఉవ్వెత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించారు. అదే పంథాతో నేడు దేశ ప్రజల అవసరాలు, సంపద సృష్టించే మార్గాలు, రైతు సంక్షేమంలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపి మరో ప్రజా ఉద్యమానికి బీజం వేయబోతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ విజయోత్సాహం స్ఫూర్తితో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. దేశం దృష్టిని ఆకర్షించేలా ఖమ్మం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ జెండా, అజెండాతో సాగే తన ప్రసంగాన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా వీక్షించేలా ఇతర రాష్ట్రాల్లోని పలు వార్తా ఛానెళ్ళతో ఒప్పందం పెట్టుకున్నారు. అదేరోజు పలు రాష్ట్రాల్లో పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారులంతా పెద్దఎత్తున పార్టీలో చేరేలా ఆహ్వానం పలికారు.
ఈ క్రమంలోనే బుధవారం ప్రగతిభవన్లో తమిళనాడు మాజీ సీఎస్, ప్రముఖ కాపు నాయకుడు రామ్మోహన్రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. తెరవెనుక జరుగుతున్న ఈ పరిణాయాలను బట్టి చూస్తే, తీవ్రతకు ప్రతిరూపంగా నిలవాలనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టు-గా స్పష్టమవుతున్నది. 2001లో జరిగిన తెలంగాణ సింహగర్జన సభకు అప్పటి జేఎంఎం నేత, జార్ఖండ్ మాజీ సీఎం శిబూసొరేన్ హాజరై, గులాబీ దళపతి కేసీఆర్కు ఎలా సంఘీభావం పలికారో.. అదేరీతిలో మెరుగైన భారత నిర్మాణానికి బయలుదేరిన సీఎం కేసీఆర్కు తొలి బహిరంగ సభకు ముగ్గురు సీఎంలు, మాజీ సీఎంలు, పలువురు జాతీయ నేతలు అండగా నిలిచారనే స్పష్టమైన సంకేతాన్ని బీఆర్ఎస్ నిర్వహించే ఖమ్మం బహిరంగ సభ ఇవ్వనున్నది సుస్పష్టం.
ఆది నుంచీ దేశంలో రాజకీయాలు ఒక పార్టీ గెలుపు.. మరో పార్టీ ఓటమి అన్నట్టు-గానే సాగుతున్నాయి. ”గెలవాల్సింది ప్రజలే కానీ.. పార్టీలు కాదు. ప్రజలు గెలిచే పంథాను రాజకీయ పార్టీలు అనుసరించాలి. అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలంటే ఒక ఆట లాంటిది. బీఆర్ఎస్కు మాత్రం అదొక టాస్క్, యజ్ఞం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా అభిమతం” అన్న సంకేతంతో నేటి సభ జరుగబోతున్నది. అందుకే అసా ధ్యాలను సుసాధ్యం చేయగలిగిన నేతగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పేరు న్నది. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా విజయ తీరాలకు తీసుకెళ్లారో, దేశాన్ని కూడా విజయాల వైపు నడిపించుకొందామన్న నినాదానికి మద్దతు కూడగట్టుకోనున్నారు. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం టీ-ఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన సభ ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం కేసీఆర్ చేసిన రణన్నినాదం.. మాటల మరఫిరంగులై దద్దరిల్లాయి. మరో పోరాటానికి తెలంగాణ నేలను సంసిద్ధం చేసి, స్వరాష్ట్ర ఆకాంక్షను యావత్తు దేశానికి ఎలుగెత్తి చాటిన సభ వేదికగా అప్పటి జేఎంఎం అధినేత శిబూసోరెన్ స్వయంగా వచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించారు. 2023 జనవరి 18న ఖమ్మం వేదికగా భారత రాష్ట్ర సమితి అధినేత తొలి బహిరంగ సభ ద్వారా దేశగతిని మార్చేందుకు, ప్రజల దుర్గతిని మాపేందుకు ఉద్యమ పథగామి కేసీఆర్ కదన శంఖారావం పూరించనున్నారు. మూడు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విపక్ష పార్టీల జాతీయ నేతలు తరలివచ్చి సంఘీభావాన్ని ప్రకటించనునున్న చారిత్రక వేదిక కాబోతున్నదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడూ, ఇప్పుడూ రెండింటిలోనూ ఉద్యమ సారథి కేసీఆరే. నాడూ, నేడూ ఢిల్లీ గద్దె గుండెల్లో అదేదడ పుట్టిస్తున్న ఘనత మా నాయకుడికే దక్కుతుందంటున్నారు.