Monday, November 25, 2024

BRS – మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం

మోత్కూర్ ,ఫిబ్రవరి 9 (ప్రభ న్యూస్) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ తీపి రెడ్డి సావిత్రి మేఘా రెడ్డి పై శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి, భువనగిరి ఆర్డీవో అమరేందర్,మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సమక్షంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కాస్త విజయవంతంగా నెగ్గింది. జనవరి 20 న 9 మంది కౌన్సిలర్లు చైర్మన్ సావిత్రి పై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్ కు తీర్మానం కాపీ అందించగా,మున్సిపాలిటీలో చైర్మన్ తో సహా 12 మంది కౌన్సిలర్ల కు అవిశ్వాసం నోటీసులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందజేసినట్లు ఆర్డీవో తెలిపారు.

అవిశ్వాసం కోసం 2/3 వంతు ప్రకారం 8 మంది కౌన్సిలర్ ల కోరం ఉండాల్సినప్పటికి … 10 మంది కౌన్సిలర్లు ( 5 గురు బి ఆర్ ఎస్,5 గురు కాంగ్రెస్) అవిశ్వాస సమావేశానికి 5 నిమిషాల ముందే సమావేశ హాల్ లోకి హాజరయ్యారు. 7 వార్డు కౌన్సిలర్ ,చైర్మన్ సావిత్రి, 10 వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి లు గైర్హాజర్ కాగా,మినహా 10 మంది కౌన్సిలర్లు ఆర్డీవో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా (అనుకూలంగా) మొత్తం 10 మంది ఏకపక్షంగా ఓటింగ్ లో చేతులెత్తడంతో ,మెజార్టీ సభ్యుల తీర్మానం ఆమోదం మేరకు అవిశ్వాసం నెగినట్లు ఆర్ డి ఓ అమరేందర్ అధికారికంగా ప్రకటించారు.

తదుపరి చర్యల నిమిత్తం నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ కు సమర్పించనున్నట్లు ఆర్డీవో వెల్లడించారు .నూతన చైర్మన్ ఎన్నిక కోసం జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషన్ కు నివేదించిన అనంతరం ప్రభుత్వ నిర్ణయం మేరకు చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారని తెలిపారు.

ఫలించిన క్యాంప్ రాజకీయాలు.. పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ నేతలు
చైర్మన్ సావిత్రి ని గద్దె దింపేందుకు స్వపక్ష కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లతో జతకట్టి నిర్వహించిన 20 రోజుల క్యాంప్ రాజకీయాలు కాస్త ఎట్టకేలకు ఫలించాయి.దీంతో క్యాంప్ రాజకీయాలు కొనసాగించిన కాంగ్రెస్ నాయకులు , తమను నిర్లక్ష్యం చేశారని ఎదురు తిరిగిన బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం నెగ్గించి తమ పంతం నెగ్గించుకున్నారు.

భారీ పోలీసు బందోబస్తు.. చౌటుప్పల్ ఏ సి పి మొగులయ్య,రామన్నపేట సి ఐ ఎన్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో స్థానిక ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు అవిశ్వాస సమావేశం ప్రశాంతంగా కొనసాగేందుకు సివిల్,సి ఆర్ పి ఎఫ్ పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. అవిశ్వాసం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా సమావేశం జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement