హైదరాబాద్ – ఎన్నికల వేళ రాష్ట్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమై చర్చలు సైతం జరిపినట్లు సమాచారం.. అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దీప్ దాస్ మున్షీని కూడా దానం కలిశారు..
తాజాగా.. స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు 2009, 2018 ఎన్నికలలో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల శాఖ, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు.