Wednesday, November 20, 2024

రేపే భారాస స‌భ – ఖ‌మ్మం గులాబీ మ‌యం..

5 లక్షల మంది జనసమీకరణ
100 ఎకరాల్లో సభా ప్రాంగణం
450 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌
ఇప్పటికే పూర్తయిన ఏర్పాట్లు
నేడు హైదరాబాద్‌కు ముగ్గురు సీఎంలు,
వివిధ పార్టీల జాతీయ నేతలు
నగరమంతా ఫ్ల్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్‌లు, స్వాగతతోరణాలు
బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు
వందలాది మందితో పటిష్ట బందోబస్తు
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు
సభ దేశ రాజకీయాలను మలుపుతిప్ప బోతోంది: హరీష్‌రావు, అజయ్ కుమార్

హైదరాబాద్‌/ఖమ్మం, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌), భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)గా అవతరించిన తర్వాత తొలి సభకు సమయం ఆసన్నమైంది. బుధవారం నిర్వహించే బీఆర్‌ఎస్‌ భారీ ఆవిర్భావ సభకు ఖమ్మం వేదిక కానుంది. కేంద్రంపై పోరాటానికి సమర భేరి మోగిస్తూనే ఈ ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లిd ఎన్నికలకు ఈ సభ వేదిక నుంచి సీఎం కేసీఆర్‌ శంఖారావం పూరించనున్నారు. జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌ విధివిధానాలను సభ నుంచి కేసీఆర్‌ ప్రకటించనున్నారు. సభకు 5 లక్షల మందికి తక్కువ కాకుండా జన సమీకరణ చేయడానికి సభ ఇన్‌ఛార్జ్‌, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే కాకుండా మహబూబాబాద్‌, సూర్యాపేటకు చెందిన పార్టీ నాయకులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా కొత్త కలెక్టరేట్‌ పరిసరాల్లోని 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలోనూ చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు అతిథు లుగా వచ్చే ఢిల్లి, కేరళ, పంజాబ్‌ సీఎంలు, ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు బుధవారం ఉదయం ఖమ్మం చేరుకోను న్నారు. వీరిలో కొందరు మంగళవారమే హైదరాబాద్‌కు చేరుకో నున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌తో కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్లలో తొలుత యాదాద్రి వెళ్లి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ఖమ్మం సభకు బయలుదేరనున్నారు. ఖమ్మంలో కంటివెలుగు రెండో విడత, కొత్త ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన తర్వాత అతిథులతో కలిసి భోజనం చేసి అనంతరం సభావేదికపైకి విచ్చేసి కేసీఆర్‌ ప్రసంగిస్తారు. స్వాతంత్రానంతరం రెండు జాతీయ పార్టీల పాలనలో దేశం ఏ విధంగా వెనుకబడిందో వివరిస్తూ, దేశాభివృద్ధికి బీఆర్‌ఎస్‌కు ఉన్న విజన్‌ను సీఎం తన ప్రసంగంలో ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

న భూతో న భవిష్యత్‌ అన్నట్లుగా సభ: మంత్రి హరీశ్‌
ఖమ్మంలో బుధవారం నిర్వహించబోయే బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆవిర్భావ సభకు సంబంధించి ఖమ్మంలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో సింహగర్జన నిర్వహించారని, టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తొలిసభ ఖమ్మంలో నిర్వహించడం సంతోషకరమన్నారు. ఖమ్మం సభ దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభగా నిలిచిపోతుందన్నారు. సభలో పలువురు జాతీయ పార్టీల నాయకులు పాల్గొంటారన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం ప్రజల పోరాటం, వారి భాగ స్వామ్యం మరువలేనిదన్నారు. వంద ఎకరాల్లో సభా ప్రాంగ ణాన్ని తయారు చేశామని పేర్కొన్నారు. వాహనాల పార్కింగ్‌ను 448 ఎకరాల్లో ఏర్పాటు చేశామని, 20 పార్కింగ్‌ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. సభలో వేయి మంది వాలంటీర్లు పాల్గొంటారని, ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. మహబూబాబాద్‌, సూర్యాపేట నుంచి సభకు ఎక్కువగా జనం హాజరవుతారన్నారు. ఖమ్మం చరిత్రలోనే పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతోందని, కేసీఆర్‌ను దీవించేందుకు సభకు తరలిరావాలని జనం ఉబలాట పడుతున్నారన్నారు. అందుబాటులో ఉన్న వాహనాల్లో జనం తరలివస్తారని, ఇతర రాష్ట్రాల నుంచి ఖమ్మం సభకు బస్సులను సమకూరుస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మాత్రమే సీఎం కేసీఆర్‌తో సభా వేదికపై ఉంటారన్నారు. మిగతా మంత్రులు, నాయకులు సభా వేదికపై ముందు ఆసీనులవుతారన్నారు.

పలువురు నేతలకు ప్రత్యేకంగా జాతీయ నేతల బాధ్యతలు
ఢిల్లి, పంజాబ్‌, సీఎంల ప్రోటోకాల్‌ను మంత్రి మహమూద్‌ అలీ చూస్తారని, కేరళ సీఎంను రిసీవ్‌ చేసుకునే బాధ్యత మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ రిసీవింగ్‌, సెండాఫ్‌ బాధ్యతలు అప్పగించామని హరీశ్‌రావు తెలిపారు. సీపీఐ జాతీయ నాయకులు డి. రాజాను ఆహ్వానించే బాధ్యతలు పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ చూస్తారన్నారు. మంగళవారం రాత్రికి నాయకులంతా హైదరాబాద్‌కు చేరుకుం టారని, 18న సీఎంతో బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం దేశ రాజకీయాలపై చర్చిస్తారన్నారు. సీఎంతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటారని, దర్శనం అనంతరం హెలికాప్టర్లలో ఖమ్మం సభకు బయలుదేరతారన్నారు. సభలో పాల్గొనే ముందు సీఎం కేసీఆర్‌ ఖమ్మం నూతన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement