Thursday, November 21, 2024

Breaking: బీఆర్‌ఎస్ నేత‌ జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత…

భువనగిరి: బ్రెయిన్ ఇన్ ఫెక్ష‌న్ తో చికిత్స పొందుతూ మృతి
తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు
బిఆర్ఎస్ య‌వ‌జ‌న విభాగానికి అధ్య‌క్షుడిగా సేవ‌లు
యువ తెలంగాణ పార్టీ స్థాప‌న‌
కాంగ్రెస్, వైసిపిలోనూ కీల‌క బాధ్య‌త‌లు
జిట్టా బాల‌కృష్ణ మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు నేత‌లు సంతాపం

భువనగిరి: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్‌ యశోద హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పట్టణ శివార్లలోని మగ్గంపల్లి రోడ్డులో ఉన్న తమ ఫామ్‌హౌస్‌లో అంత్య‌క్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా జిట్టా మ‌ర‌ణం ప‌ట్ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్, హ‌రీశ్ రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజ‌య్, కిష‌న్ రెడ్డి త‌దిత‌రులు సంతాపం ప్ర‌క‌టించారు..

జననం..

జిట్టా బాలకృష్ణ రెడ్డి 14 డిసెంబర్ 1972న తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో బీబీ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, 1993లో ఎల్‌బీ నగర్ నుంచి డీవీఎం డిగ్రీ అండ్ పీజీ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు.

రాజ‌కీయ ప్ర‌స్థానం

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. కానీ, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ దక్కకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. 2009లో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. అయితే లోక్‌సభలో వైఎస్ జగన్ తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో అక్కడి నుంచి కూడా బయటపడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని నెలకొల్పి కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పాల్గొన్నారు.

శోకసంద్రంలో భువనగిరి..

జిట్టా బాలకృష్ణారెడ్డి మరణ వార్త తెలుసుకుని భువనగిరి, ఆలేరు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచి భువనగిరి కోటకు లైట్లు వేయడం, భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అన్ని గ్రామాల్లో యువతను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పోరాటంలో ఉత్సాహపరచడం, గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, సాగు, తాగునీటి కాలువల కోసం పోరాటం చేశారు.

ఇక పోచంపల్లి ప్రాంతంలో కాలుష్య కంపెనీలపై కొట్లాడడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేయడంతో ఆయన లేరన్న వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తిరిగి కోలుకుని ఆరోగ్యంగా ప్రజల ముందుకు రావాలని ఇటీవలే ఆయన అభిమానులు భువనగిరి ఎల్లమ్మ గుడి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నియోజకవర్గంలోని చాలా చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. కానీ, ఇప్పుడు ఆయన మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

నేడు సాయంత్రం అంత్యక్రియలు..

జిట్టా బాలకృష్ణారెడ్డి అంతక్రియలు నేడు సాయంత్రం నిర్వహించనున్నారు. భువనగిరి శివారులోని మగ్దూంపల్లి దారిలో ఉన్న ఆయన వ్యవసాయ క్షేత్రం వద్ద అంతక్రియలు జరగనున్నన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement