Saturday, November 9, 2024

TG: మూసీ సుంద‌రీక‌ర‌ణ‌కు బీజం వేసిందే బీఆర్ఎస్‌… కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

ఆంద్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : మూసీ సుందరీకరణకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్పట్లో మూసీ సుందరీకరణకు బీజం వేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోగానే మూసీ బెల్ట్ ఏరియాలోని నిరుపేదలు ఆ పార్టీకి గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు.

అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు. నిరుపేదలు నివాసం ఉంటున్న బస్తీలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇలా.. కూల్చివేతలతో సర్కార్ మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటుందా అని ప్రశ్నించారు.

- Advertisement -

ఏక‌ప‌క్షంగా పేద‌ల ఇళ్లు కూల్చివేత‌…
పేదల ఇళ్ల కూల్చివేతల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని కిష‌న్‌రెడ్డి మండిప‌డ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం అందరికీ మంచి చేయాలని, ఇలా ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదని హితవు పలికారు. పేదల ఇళ్ల కూల్చివేతలకు తమ పార్టీ విరుద్ధమన్నారు.

మంత్రి సురేఖ వ్యాఖ్య‌ల‌పై ఖండ‌న‌…
అక్కినేని కుటుంబం, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కిష‌న్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళగా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అలవాటైపోయిందని మండిప‌డ్డారు. ఇలాంటి సంస్కృతిని కేసీఆర్, కేటీఆర్ మొదలు పెడితే.. రేవంత్ అండ్ కో కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఇలాంటి నాయకులను బహిష్కరించాలని కిషన్‌రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement