హైదారాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు లబ్ధి కలిగిస్తున్న సంక్షేమ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలతో కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ప్రజలకు లబ్ధి కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలను రద్దు చేయకుండా లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పారు. దళిత బంధు, గొర్రెల పంపిణీ రద్దు చేయడం అంటే బలహీనవర్గాలకు, దళితులకు తీరని ద్రోహం చేసినట్లేనని తెలిపారు. పట్టణాలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నదని కేటీఆర్ అన్నారు