Friday, November 22, 2024

BRS – ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు – కెసిఆర్

ఎర్రవల్లి – అధికారం కోల్పోవడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగేళ్లు రాష్ట్ర సాధన కోసం పదేళ్లు ప్రగతి సాధన కోసం తన ఉద్యమం సాగిందని చెప్పారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో సోమవారం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా వేసి ఆహ్వానించిన కేసీఆర్‌ ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

.. ”ప్రవీణ్‌కుమార్‌ను భారాస ప్రధాన కార్యదర్శిగా నియమిస్తాం. పార్టీ నిర్మాణం చేసుకుందాం.. కమిటీలు వేసుకుందాం. రానున్న రోజుల్లో మనం అద్భుతమైన విజయం సాధిస్తాం. బహుజన సిద్ధాంతం అమలు దిశగా దేశానికి తెలంగాణను టార్చ్‌ బేరర్‌గా చేద్దాం” అని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి ప్రజలు అటు వెళ్లారని.. ఇప్పుడు వారికి వాస్తవం అర్థమవుతున్నదని పేర్కొన్నారు. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకేలా ఉండాలని తెలిపారు.

‘పాలకుల మీద ఐకమత్యంతో పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలే. కలగలిసి పోవాలంటే ఏం చేయాలో ఆలోచన చేయాలి. అగ్రవర్ణాల్లోని పేదలతో కూడా కలుపుకు పోవాలి. ప్రతీప శక్తులమీద పోరాడుతూనే కలిసివచ్చే శక్తులను కలుపుకపోవాలి. వారి శక్తిని మనం ఉపయోగించుకోవాలి. 20 శాతం ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదే మీ లేదు’ అని కేసీఆర్‌ చెప్పారు. రాజకీయాల్లో అనేక కష్టాలు వస్తాయి. తట్టుకొని నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగాలి. దేశానికే ఆదర్శంగా మన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినం’ అని గుర్తు చేశారు.

ఉద్యమ కాలాన్ని గుర్తు చేసుకున్న కేసీఆర్‌.. ‘తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నేను తిన్న తిట్లు ఎవరూ తినలే. నా మీద దండకాలు కూడా రాసిండ్రు. ఎన్ని కష్టాలెదురైనా ప్రలోభాలు పెట్టినా తెలంగాణ వాదాన్ని వదల్లేదు. అవసరమైన పంథాను ముందుపెట్టి తెలంగాణ కోసం పోరాటం లో కేంద్రాన్ని గజ్జున వణికించినం. శూన్యం నుంచి సుడిగాలిని సృష్టించినం. గిటువంటి సమస్యలెన్నో చూసినం ఇదో లెక్కగాదు. మీలాంటి యువత నాయకత్వం ఎదిగితే.. ఈ చిల్లర వచ్చిపోయే వాళ్ల ఇట్లాంటి స్వార్థ పరుల అవసరం ఉండదు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల వరకు మీరంతా నాయకులుగా ఎదగాలని సూచించారు.

- Advertisement -

‘దేశంలో ఇంతవరకూ దళిత బంధు వంటి పథకం ఎవరూ తీసుకురాలేదు. అనేక చర్చలు మేధోమథనం తర్వాత రైతుబంధు తీసుకువచ్చాం. సాగునీటి ప్రాజెక్టులను తెచ్చినం తద్వారా రాష్ట్రంలో మూడు కోట్ల టన్నులకు ధాన్యం ఉత్పత్తి చేరుకుంది’ అని కేసీఆర్‌ గుర్తు చేశారు.’నాటి ఉద్యమ కాలంలో అనివార్యంగా కొన్ని మాటలు అనాల్సి వచ్చిందే తప్ప ఎట్లబడితే అట్లా అసభ్యంగా బూతు మాటలు మాట్లాడలేదు. పరుష పదాలతో దురుసు మాటలతో తిట్టలేదు’ అని వివరించారు. ‘ప్రజా జీవితం అన్నప్పుడు ఓడినా గెలిచినా ఒకేలా ఉండాలే. మన ప్రజలు మన రాష్ట్రం అనే పద్ధతిలోనే ముందుకుసాగాలి. అధికారం ఉంటే ఒకతీరు లేకుంటే మరో తీరు ఉండొద్దు’ అని సూచించారు.

‘అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చింది. ఇవి ఎక్కడ పోవు. వచ్చేటాయన ఎక్కువ ఇస్తాడనే ఆశకు పోయి మోసపోయిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు నమ్మి అటు మళ్లారు. ఇప్పుడు ప్రజలకు అర్థమైతున్నది వాస్తవం. ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు. గాడిద వెంట పోతేనే గదా గుర్రాల విలువ తెలుసుద్ది’ అని ప్రస్తుత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యంగ్యాంస్త్రాలు సంధించారు.

తాను ఒక్కసారి మాటిస్తే మడమ తిప్పకుండా ఉంటానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు రెండున్నర సంవత్సరాలుగా బీఎస్పీ పార్టీలో 50 వేల కిలోమీటర్ల వరకు యాత్ర చేసి, బహుజనులను చైతన్యపరిచామని చెప్పారు. బహుజనవాదం, తెలంగాణవాదం రెండూ ఒకటేనని.. ఈ రెండూ అణచివేతకు గురయ్యానని చెప్పారు. ఈ రెండు ఒక్కటైతేనే.. తెలంగాణ రాష్ట్రం మరింత బలపడుతుందని తెలిపారు. తాను నిజంగానే అమ్ముడుపోతే.. అధికార పార్టీలో ఉండేవాడినని తనపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్యాకేజీల కోసం కాదు, ప్రజాసేవ కోసమే

పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారిని వెతుక్కోవాల్సి వచ్చిందని వివరించిన ప్రవీణ్‌కుమార్.. తన నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా బీఎస్పీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాను బీఆర్ఎస్‌లోకి చేరానన్నారు. తాను ప్యాకేజీల కోసం కాదు, ప్రజాసేవ కోసమే ఈ పార్టీలోకి చేరడం జరిగిందని స్పష్టం చేశారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందేనని.. ఇదే తాను నమ్మిన ధర్మమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో స్వర్ణయుగాన్ని చూసిందని.. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేకపోయినా ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. బహుజన వాదం అంటే స్వార్థపరులు ఉండేది కాదన్న ఆయన.. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకొని వచ్చామని తెలిపారు. తన గుండెల్లో ఇప్పటికీ బహుజన వాదం ఉందని పేర్కొన్నారు.

. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, మెతుకు ఆనంద్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య, గువ్వల బాలరాజు, మాజీ చైర్మన్లు రవీందర్ సింగ్, బాలరాజు యాదవ్, తదితరులున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement