ఆంధ్రప్రభ స్మార్ట్, సంగరెడ్డి: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పదవులు రద్దు చేయాలని కోరతూ సుంప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు హరీష్‌రావు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకున్నారని, పార్టీ పని అయిపోయిందన్నారని గుర్తు చేశారు. అలా అన్నవాళ్లే కాలగర్భంలో కలిసిపోయారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏం తక్కువ చేశాం? ఎందుకు కాంగ్రెస్ లోకి వెళ్లారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉంటే కష్టాలు వస్తాయని.. భయపడి పార్టీ మారారని అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గానికి ఏది అడిగితే అదే మంజూరు చేశారమని గుర్తు చేశారు.
పార్టీ మారిన వారు మాజీలు చేసే వరకూ నిద్రపోం
పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీలు చేసే వరకు నిద్రపోమని హరీష్ రావు అన్నారు. మహిపాల్ రెడ్డి పార్టీ మారినా బీఆర్ ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు మత్రం ఆయనే ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని విమర్శించారు.
రుణమాఫీ జీవో మార్చాలి…
రుణమాఫీ పై జీవోను వెంటనే మార్చాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాటల్లోనే పాస్ బుక్ ప్రకారం అని అంటున్నారు. కానీ జీవోల్లో మాత్రం తెల్ల రేషన్ కార్డు నిబంధన ఉందని చెప్పారు. రుణమాఫీలో పీఎం కిసాన్, రేషన్ కార్డు నిబంధనతో ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ అందరికి రుణమాఫీ చేశారని .. ఇప్పుడు కూడా మునపటి పద్దతిలోనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.