పఠాన్ చెరు, ప్రభ న్యూస్ : సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నదని, గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి బీసీ బందు మైనార్టీ బందు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన మొత్తం 382 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఇందులో 283 బీసీ బందు, 99 మైనార్టీ బందు కింద ప్రభుత్వం ద్వారా మంజూరైన 3 కోట్ల 82 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను అమలు చేస్తుందన్నారు. అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లెక్కకు మించిన పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు. ఎవరిని కదిలించినా సంక్షేమ పథకాల ముచ్చటే కనిపిస్తుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గడపగడపకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.