హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: ఎన్నికలే లక్ష్యంగా కారు జోరు పెంచాలని డిసైడైంది. ఓవైపు ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ మరో వైపు సొంతపార్టీ సైన్యాన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరపడంతో పాటు- అక్టోబర్‌లో వరంగల్‌లో నిర్వహించే సభ దాకా పక్కాగా షెడ్యూల్ రూపొందించుకుంది. వచ్చే ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధులు, హామీలు అన్నింటిపైనా బీఆర్‌ఎస్ వర్గాలు ఇప్పటినుండే కసరత్తు చేస్తున్నాయి. ఏప్రిల్ 25న నియోజకవర్గస్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించిన పార్టీ నాయకత్వం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో 27వ తేదీన ఆవిర్భావ దినోత్సవం జరపనుంది. అదే రోజు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌దే అధికారమని ధీమాగా ఉన్న నాయకత్వం ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా దూసుకుపోవాలని నిర్ణయించింది. అక్టోబర్ 10వ తేదీన వరంగల్‌లో పార్టీ మహాసభ జరగనుండగా, ఇప్పటికే నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంపై అధినేత సంతోషంగా ఉన్నారు.
ఎన్నికలే లక్ష్యంగా..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం ఎమ్మెల్యే సాయన్న అకాలమరణం కారణంగా మరో ఇన్‌ఛార్జ్ అనివార్యమైంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా పోటీ-దారు కాకుండా మరో కీలక నేత మర్రి రాజశేఖర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల కోణంలో బీఆర్‌ఎస్ ప్రతీ నియోజకవర్గాన్ని ఎంత జాగ్రత్తగా భావిస్తున్నదో, ఎంత సూక్ష్మంగా ప్రణాళికలు రచిస్తున్నదో స్పష్టమవుతున్నది. గోషామహల్, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా సీఎం కేసీఆర్ ఇదే రీతిన ఇన్‌చార్జ్‌లను నియమించారు. భద్రాచలంలో గతంలో పోటీ-చేసిన అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యతిరేక వర్గంలోకి వెళ్ళగా, ఈ నియోజకవర్గ బాధ్యతలు ఎంపీ మాలోత్ కవితకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు- సాధించడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది. ఏప్రిల్ 27న తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ పలు సంచలన ప్రకటనలు చేసే అవకాశముంది. ప్రధాని మోడీపై, బీజేపీ కేంద్ర నాయకత్వంపై విరుచుకుపడడం ద్వారా ఇప్పటికే సమరానికి సై అన్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లోనూ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. బీఆర్‌ఎస్ కార్యాచరణ ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తుండగా, వచ్చే ఎన్నికల దాకా ఇదే దూకుడు కొనసాగించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించుకుంది. అధినేత కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలు పార్టీ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. సారు ఉన్నంతవరకూ కారే.. అని గులాబీ శ్రేణులు తిరుగులేని ధీమాను ప్రదర్శిస్తున్నాయి.