హైదరాబాద్, ఆంధ్రప్రభ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యర్థి అని ప్రచారం జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టుపక్కల తప్ప బీజేపీకి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా పట్టు లేకపోవడంతో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు సమాచారం. నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ రెండుసార్లు విజయం సాధించినప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే బీఆర్‌ఎస్ పార్టీ పోరాడి గెలిచింది. అయితే 2018లో సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిన తర్వాత ఆ పార్టీ నుంచి గెలిచిన వారిలో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా బీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పనయిపోయిందన్న ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు గ్రూపు తగాదాలు, పార్టీ పదవుల కోసం పోటీలో ముఖ్య నాయకులు పార్టీని వీడడంతో ఆ పార్టీ సోదిలో లేకుండా పోయిందన్న భావన నెలకొంది. ఇంత జరిగినా రాష్ట్రంలో మళ్లిd సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంకగా చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్‌సేహాత్ జోడో యాత్రలో భాగంగా చేస్తున్న ఆరోపణలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై పెద్ద ఎత్తున సవాళ్లు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ నిర్వహిస్తున్న సభల్లోనూ నేతలు కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన కేటీఆర్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల విషయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు వీధిపోరాటాలు చేసుకుని, పోలీసులు జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. రేవంత్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభంలోనూ పినపాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తనపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.
చాలా నియోజకవర్గాల్లో కానరాని బీజేపీ అభ్యర్థులు…
2018 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సిట్టింగ్ సీటు హుజూర్‌నగర్‌ను ఉప ఎన్నికలో గెలుచుకుని బీఆర్‌ఎస్ రాష్ట్రంలో తమకిక తిరుగులేదన్న భావనలోకి వెళ్లింది. ఇలా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు తిరుగులేదనుకుంటున్న సమయంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచి బీజేపీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో డివిజన్లను గెలుచుకున్నప్పటికీ ఎంఐఎం, టీఆర్‌ఎస్ పొత్తు కారణంగా మేయర్ సీటును దక్కించుకోలేకపోయింది. అయితే ఆ తర్వాత ఈ స్థాయి టెంపోను బీజేపీ కొనసాగించలేకపోయింది. తర్వాత జరిగిన నాగార్జునసాగర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్యేపోరు జరిగింది. హుజూరాబాద్‌ను బీజేపీ గెలుచుకోగా మునుగోడును బీఆర్‌ఎస్ గెలుచుకుంది. అయితే ప్రస్తుత ఏడాది చివరిలో డిసెంబర్‌లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో బీఆర్‌ఎస్‌కు, బీజేపీ ప్రత్యర్థి అని ప్రచారం జరుగుతున్నప్పటికీ కాషాయ పార్టీకి గ్రామీణ తెలంగాణలో ఇప్పటికీ అభ్యర్థులేరన్న వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే సమయం ఉండడం , నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థులు కనిపిస్తుండకపోవడంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఆయా చోట్ల కాంగ్రెస్ నేతలే ప్రత్యర్థులుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిన తర్వాత బీజేపీలోకి చేరికలు ఆగిపోవడం, ఆ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకు స్పందన లేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే తమకు ఈసారీ కాంగ్రెస్ నేతలే ప్రత్యర్థులవుతారని పలువురు బీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈసారి జరిగే అసెంబ్లిd ఎన్నికల్లో నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల బలాలను బట్టే పోరు జరుగుతుందని, దీంతో హంగ్ వచ్చే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.