ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఆటో కార్మికుల పై మొసలి కన్నీరు కారుస్తోందని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు.
మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తే, ఆటో సర్వీసులకు ప్రభావం పడుతుందని చెప్పడం సరికాదన్నారు. బస్సులు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళకుండా, బస్సు స్టాండ్ నుండి వెళ్ళడం మాత్రమే జరుగుతోందని, ప్రజలు ఇంటి దగ్గర నుండి బస్సు స్టాండ్ వరకు వెళ్ళేందుకు ఆటో సేవలను ఉపయోగించుకుంటున్నారని వివరణ ఇచ్చారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా…
ఆటో కార్మికులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్న హామీ ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం కారణంగా ఇవ్వలేకపోయామని మంత్రి చెప్పారు. త్వరలో ఆ హామీ నెరవేరుస్తామని తెలిపారు. ఆటో కార్మికులు వేసుకునే డ్రెస్ లు వేసుకోవడం, బేడీలు వేసుకొని వేషాలు వేయడం అదొక రాజకీయ డ్రామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాలకు సంబంధించి నిరసనలు చేయడం అవసరం లేదని, నిజంగా చిత్తశుద్ధితో ఉన్నా, ఎప్పుడైనా రవాణా శాఖ మంత్రికి ఆటో కార్మికుల సమస్యలపై రిప్రజెంటేషన్ చేసారా అని ప్రశ్నించారు.