హైదరాబాద్ – బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ షురూ కానుంది. తెలంగాణ భవన్ వేదికగా రేపటి నుంచి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రేపటి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవ రావు, మాజీ సభాపతి మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈనెల మూడో తేదీ నుంచి ఈనెల 12వ తేదీ వరకు తొలి విడతగా రోజుకు ఒక లోక్ సభ నియోజకవర్గం చొప్పున సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండో దఫా సమావేశాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానుండగా ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులని ఆహ్వానించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సన్నాహక భేటీలో చర్చిస్తారు. ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. సన్నాహక సమావేశాల అనంతరం, క్షేత్రస్థాయిలో ప్రచార పర్వాన్ని బీఆర్ఎస్ చేపట్టనుంది.
తేదీల వారీగా పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహాక సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి..
- 3న ఆదిలాబాద్
- 4న కరీంనగర్
- 5న చేవెళ్ల
- 6న పెద్దపల్లి
- 7న నిజామాబాద్
- 8న జహీరాబాద్
- 9న ఖమ్మం
- 10న వరంగల్,
- 11న మహబూబాబాద్
- 12న భువనగిరి
సంక్రాంతి అనంతరం..
- 16న నల్గొండ
- 17న నాగర్ కర్నూల్
- 18న మహబూబ్ నగర్
- 19న మెదక్
- 20న మల్కాజ్ గిరి
- 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్.
ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లా పార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు.
తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.