Tuesday, November 19, 2024

BRS Confident – రాజాసింగ్, బండి సంజ‌య్ ల‌ను చిత్తుగా ఓడిస్తాం….కెటిఆర్

హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం భాగంగానే కాంగ్రెస్ పార్టీ గోషా మహల్, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టిందని అన్నారు బిఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్యక్షుడు, మంత్రి కెటిఆర్ . ఈ సారి గోషా మహల్‌లో రాజాసింగ్‌ను, కరీంనగర్‌లో బండి సంజయ్‌ను ఓడిస్తామని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు లేకుండా చేస్తామన్నారు. రైతు బంధు నిధులు విడుదల చేస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న రేవంత్ రెడ్డి పీఎం కిసాన్ యోజనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంట్, డీకే శివకుమార్ ఏడు కరెంట్ అంటున్నారు, కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ సూచించారు.

ల‌క్షా 60వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశాం..
బీఆర్ఎస్ సర్కార్ లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని.. దేశంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాకు భర్తీ చేసిన రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చార‌ని.. కానీ బీఆర్ఎస్ సర్కార్ మాత్రం సంవత్సరానికి 16 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. ఉద్యోగాలపై మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి జీవితంలో ఉద్యోగం చేశారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 4 నేనే స్వయంగా అశోక్ నగర్ వెళ్లి జాబ్ క్యాలెండర్‌ను రూపొందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.

29న దిక్షా దివ‌స్ జ‌ర‌పాల‌ని కెటిఆర్ పిలుపు
తెలంగాణ జాతిని ఏకం చేసి 14 ఏళ్లుగా నవంబర్ 29న దీక్షా దివాస్ జరుపుకుంటున్నామని.. ఈ ఏడాది కూడా ఘనంగా దీక్షా దివాస్ నిర్వహిస్తామని తెలిపారు కెటిఆర్ . తెలంగాణ అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ పోరాట స్ఫూర్తిని నవంబర్ 29న దీక్షా దివస్ ద్వారా తెలపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలంతా 29న దీక్ష దివాస్ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజుకు మూలంగా నవంబర్ 29కి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కేసీఆర్ తెగించి పోరాడి తెలంగాణ సాధించారని అన్నారు. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది, తెలంగాణ రాష్ట్రాన్ని తేలేకపోతే రాళ్లతో కొట్టిచంపండి అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ పోరాటంతోనే మనకు తెలంగాణ సాకారమైందని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన చేసిన అమరణ నిరాహార దీక్షతోనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించిందని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుందని మండిపడ్డారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement