పెద్దపల్లి రూరల్, ఆగష్టు 6(ప్రభ న్యూస్): రానున్న ఎన్నికల్లో పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి హాట్రిక్ విజయం ఖాయమని పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ బండారి రాంమూర్తి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. పదవీ ఉన్నకాలంలో ప్రజలకు ఏం ఒరగబెట్టారని నిలదీశారు. ఆశించిన ప్యాకేజీ రాకపోవడంతో పార్టీ మారారని విమర్శించారు. పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేనివారు అసత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజా క్షేత్రంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, విజయ రమణారావు, మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య తప్పుడు ఆరోపణలు మానుకోవాలని, లేకుంటే తగిన విధంగా బుద్ది చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సలేంద్ర రాములు, ఎలబోతారం శంకర్, తోట శ్రీనివాస్, నర్ల పోల్ రాజు, అరికిల్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.