Wednesday, November 20, 2024

ED – స్వచ్ఛ బయో డీల్ పై ఈడికి బి అర్ ఎస్ ఫిర్యాదు…

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం స్వచ్ఛ బయో సంస్థతో రూ.1000 కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ డీల్ వెనుక పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్… ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడిపై ప్రతిపక్ష పార్టీ ఆరోపణలను గుప్పించింది. స్వచ్ఛ బయో, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

- Advertisement -

బీఆర్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం… ప్రతిపక్షం ఇచ్చిన ఫిర్యాదును ఈడీ స్వీకరించి, రసీదు ఇచ్చింది. స్వచ్ఛ బయో డైరెక్టర్‌లలో ఒకరు స్వయానా సీఎం సోదరుడు అనుముల జగదీశ్వర్ రెడ్డి ఉన్నారని, ఇది క్విడ్ ప్రోకో అని బీఆర్ఎస్ ఆరోపించింది. స్వచ్ఛ బయో డైరెక్టర్లలో ఒకరు అనుముల జగదీశ్వర్ రడ్డి కావడం ఆందోళన కలిగించే అంశమని, ఇది ఈ ఎంవోయూ చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా ఉందని ఈడీకి రాసిన లేఖలో పేర్కొంది.

అమెరికాలోని ఫిలడెల్పియాలో సీఎం అధికారిక పర్యటనకు కేవలం 15 రోజుల ముందు స్వచ్ఛ బయోను తెరపైకి తీసుకు వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రిజిస్టర్ అయిన ఈ కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి క్రియాశీల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేదని, ఇది షెల్ కంపెనీ అని ఆరోపించింది.

ఈ కంపెనీని అమెరికాలోనే ఎందుకు ప్రకటించారు? ప్రయోజనం ఏమిటి? ఈ కంపెనీలో విదేశీ నిధులు ఉన్నాయా? మనీ లాండరింగ్‌ ఉందా? అనే అంశాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. ఎంవోయూపై సంతకం చేసే సమయంలో రేవంత్ రెడ్డి పక్కన హర్ష పసునూరి ఉండటంపై కూడా తన ఫిర్యాదులో బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేసింది.

ఎంవోయూపై సంతకాలు చేసిన సమయంలో సీఎం పక్కన ఉన్న వ్యక్తి పసునూరి హర్ష అని వెల్లడించింది. హర్ష పసునూరి, సీఎం సోదరుడు తమ ఆర్థిక పరిస్థితిని వివరించాలని, రూ.1000 కోట్ల పెట్టుబడులు ఎలా పెడతారో చెప్పాలని డిమాండ్ చేసింది. విషయమై అధికారులు సమగ్ర విచారణ జరపాలని కోరింది.ఇది పూర్తి అవినీతిమయమైన ఎంవోయూ అని, కాబట్టి అధికారులు తమ ఫిర్యాదును స్వీకరించి స్వచ్ఛ బయో డైరెక్టర్లతో పాటు రేవంత్ రెడ్డిపై న్యాయ విచారణ జరపాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement