ఖానాపూర్- ఎన్నికల సమయంలో రాయి ఏదో రత్నం ఏదో గుర్తించాలని కేసీఆర్ అన్నారు. ఆలోచించి ఓటు వేయండి.. లేకపోతే ఐదు ఏండ్లు ఆగం అవుతారని చెప్పారు. బీఆర్ఎస్ మీ ముందే పుట్టిందని, ఏం చేసిందో చూశారని తెలిపారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అభ్యర్థులనే కాదు.. వాళ్ల వెనకున్న పార్టీలను చూడండని కేసీఆర్ సూచించారు. ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ , రైతుబంధు ఇచ్చే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తరో లేదంటే రైతుబంధు దుబారా అంటున్న కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తరో మీరే ఆలోచించుకోవాలని ఓటర్లను ఉద్దేశించి అన్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్యాయం జరుగుతదని, పదేళ్లుగా జరిగిన అభివృద్ధి మళ్లీ వెనక్కి పోతదని హెచ్చరించారు. చెప్పుడు మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించవద్దని చెప్పారు.
ఆలోచించి ఓటేయకపోతే ఐదేళ్లు నష్టపోతరని చెప్పారు. ఏ ప్రభుత్వం అమల్లోకి వస్తే.. మంచిదో చర్చించి ఓటేయండని కోరారు. 50ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. . భారత దేశంలో మొట్టమెదటి సారి రైతుబంధు పుట్టిందే.. కేసీఆర్, బీఆర్ఎస్ నుంచి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం ఒక్క బీఆర్ఎస్ కే తెలుసని చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు, 24గంటల కరెంట్ వేస్ట్ అని విమర్శిస్తున్నారు. వాళ్లు చేసే విమర్శలు కరెక్టేనా అని ప్రశ్నించారు.
రైతుబంధు ఉండటమే కాదు.. మళ్లీ అధికారంలోకి వస్తే రూ. 16 వేలకు పెంచుతామని తెలిపారు. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. 24గంటల కరెంట్ కావాలా లేక 3 గంటల కరెంట్ కావాలా అని ప్రశ్నించారు. కాబట్టి ప్రతీ గ్రామాల్లో ప్రజలు చర్చలు జరిపి ఓట్లు వేయాలని కేసీఆర్ చెప్పారు