హైదరాబాద్, ఆంధ్రప్రభ: మిత్రపక్షాలుగా ఉన్న బీఆర్ ఎస్, ఎంఐఎం మధ్య గ్యాప్ పెరిగిందా? రెండు పార్టీల మధ్య స్నేహం వికటించిందా? తమ పార్టీల్లో నంబర్ టూగా ఉన్న నేతలు శాసనసభ సాక్షిగా విమర్శలు చేసుకోవడం దేనికి సంకేతం? ముందస్తు వ్యూహమా? అనుకోకుండా జరిగిన సంఘటనా? అనే విషయంపై రాజకీయవర్గాల్లోనే గాక ప్రజల్లో కూడా తీవ్ర చర్చ మొదలైంది. శనివారం శాసనసభలో రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు, మజ్లిస్ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్రస్థాయిలో జరిగిన వాగ్వాదం జరిగిన తర్వాత వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 50 స్థానాల్లో పోటీ చేస్తామని, 15 స్థానాల్లో గెలిచి వస్తామని అక్బర్ ఛాలెంజ్ చేయడం చర్చనీయాంశమైంది.
గడచిన తొమ్మిదేళ్లుగా భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (మజ్లిస్) పార్టీలు మిత్రపక్షా లుగా కొనసాగుతున్నాయి. 2018లో జరిగిన శాసనసభ ఎన్ని కల్లో ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన పోటీ జరిగింది. పాత బస్తీలో మజ్లిస్ పోటీ చేసిన స్థానాల్లో బీఆర్‌ఎస్ నామమా త్రం గా అభ్యర్థులను రంగంలోకి దింపి ఆ పార్టీ గెలుపుకు కృషి చేసిందనే విమర్శలు ఉన్నాయి. అదే విధంగా మిగతా స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకే మజ్లిస్ ఓట్లు పడ్డాయని ప్రచారంలో జరిగిన విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య మంచి స్నేహం ఉండడంతో పాతబస్తీలో మజ్లిస్ హవా కొనసాగు తోంది. మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ మాటే ప్రభుత్వ కార్యాలయాల్లో చెల్లుబాటవుతోంది. మంచి మిత్రులుగా ఉన్న రెండు పార్టీలకు చెందిన నేతలు హఠాత్తుగా విమర్శలు చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత తీవ్రస్థాయిలో వివాదం జరగటానికి కారణం తెలియనప్పటికీ ఎవరికి వారు రెండు పార్టీల మధ్య చెడిందనీ.., లేదు…, అను కోకుండా శాసనసభలో నేతలు విమర్శలు చేసుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ చర్చలో పాల్గొ న్నారు. ఆయన ప్రసంగంలో బీఆర్‌ఎస్ పార్టీని స్వాగతిస్తు న్నాం అంటూనే బీజేపీతో తాము బీటీం అని విమర్శించారని, ఇప్పుడు బీఆర్‌ఎస్ ఏ టీం అవుతుందో చెప్పాలని ఘాటైన పదజాలంతో ప్రశ్నించారు. అదే సందర్భంగా ప్రభుత్వం పాత బస్తీకి ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శలు గుప్పించారు. అంతేగాక గవర్నర్ ప్రసంగానికి మంత్రి మండలి ఆమోదం ఉందా? సభకు సీఎం, మంత్రులు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించడంతో సభలో పరిస్థితి ఒక్కసారిగా మారింది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని అక్బర్ నిలదీయడంతో బీఆర్‌ఎస్ సభ్యులు అక్బర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి కూడా అక్బర్‌కు ధీటుగా సమాధానం చెప్పారు. అక్బరుద్దీన్ ఏ ఉద్దేశ్యంతో విమర్శలు చేశారో కానీ, రెండు పక్షాల మధ్య మాటామాటా పెరగడం… మేం ఒంటరిగానే పోటీచేస్తామని అక్బర్ ప్రకటించే వరకు వచ్చింది. ఇదంతా అనుకోకుండా జరిగిన ఘటన కాదని, రెండు పార్టీల మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వైరం శాసనసభలో బద్ధలైందని కూడా విశ్లేషకులు అంటున్నారు.
మజ్లిస్ పార్టీకి జాతీయ స్థాయి గుర్తింపు కోసం జాతీయ స్థాయిలో మహా రాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. బీహార్, మహారాష్ట్రల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోణి కొట్టిన విషయం తెలిసిందే. అంతేగాక, తాము వచ్చే ఎన్నికల్లో 50స్థానాల్లో పోటీచేస్తామని అక్బరుద్దీన్ ప్రకటిం చడం కాకతాళీయం కాదని, అది ముందస్తు వ్యూహమేనని అం టున్నారు. ఇప్పటికే పోటీ చేసే స్థానాలపై దృష్టి సారించిందని చెబుతున్నారు. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ను భారత్ రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్)గా మార్చారు. పార్టీ విస్తరణలో భాగంగా అధ్యక్షుడు కేసీఆర్ దేశవ్యాప్తంగా కమిటీల ఏర్పాటులో దృష్టి సారించారు.
తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సారథులను కూడా ప్రకటించారు. తొలి బహిరంగ సభను ఖమ్మంలో భారీ స్థాయిలో నిర్వహించి సత్తా చాటారు. కేరళ, ఢిల్లిd, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఈ సభకు హాజరుకావడంతో బీఆర్‌ఎస్ పార్టీ యావత్ భారత్ దృష్టిని ఆకర్శించింది. ఆ సభతో బీజేపీకి భవిష్యత్‌లో తమ పార్టీ ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని కేసీఆర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్, మజ్లిస్ రెండు పార్టీలు కూడా జాతీయ స్థాయిలో తమ పార్టీ లను విస్తరించే క్రమంలో రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. మొత్తం మీద మిత్రపక్షాల మధ్య బంధం ఉందా? వికటించిందా? అనేది భవిష్యత్ తేల్చనుంది.