సిరిసిల్ల, ఏప్రిల్ 8 (ప్రభన్యూస్) : నేతన్నల జీవితాలతో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయ ఆట ఆడుతున్నాయని, నేతన్నల పేరుతో శవ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిరిసిల్లలో నెలకొన్న వస్త్ర సంక్షోభ పరిస్థితులపై సోమవారం మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదు శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నేతన్నలపై శవ రాజకీయాలు మెరుపుతున్న సంఘటనలపై ప్రజలకు, నేతన్నలకు వాస్తవాలను తెలియజెప్పడం కోసమే సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ రెండు పార్టీలు గత పదేళ్లుగా అధికారంలో ఉన్నారని, తాము అధికారంలోకి వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయ్యిందన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేతన్నల ప్రయోజనం కోసం నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.
బీజేపీ ప్రభుత్వం వస్త్రాలపై 12 శాతం జీఎస్టీని విధించి నేతన్నల నడ్డి విరిచిందని, ఈ రంగాన్ని అనేక విధాలుగా వేధింపులకు గురి చేసిందన్నారు. అనేక జాతీయ పథకాలను రద్దు చేసిందని, బుల్కర్ బీమా, ఐసిఐసిఐ ఆరోగ్య భీమా, హౌస్ కం వర్క్ షెడ్ పథకాలను కేంద్రం రద్దు చేసిందన్నారు. అసమర్ధుడైన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈనెల 10న దీక్ష చేస్తానని అంటున్నాడని, తమిళనాడు, తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో తెలుపాలని పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సిరిసిల్ల నంబర్ వన్ గా ఉండేదని, మాజీ ఎంపీ తన ప్రాంతానికి చెందిన వరంగల్ కు మెగా టెక్స్టైల్ క్లస్టర్ ను తీసుకెళ్లాడని, సిరిసిల్లకి ఇవ్వాలని తాము కోరినప్పటికీ ఆనాడు నోరెత్తని ప్రస్తుత ఎంపీ ఏ ముఖం పెట్టుకొని దీక్ష అంటున్నాడని ప్రశ్నించారు. నేత వృత్తి పరమైన అంశం ఆయనకు ఏమీ తెలవదని, కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని, ఎస్ఐడిపి కింద రూ.350 కోట్లు రావాల్సి ఉండగా 25 శాతం రాష్ట్ర వాటా పోగా ఇందులో 50 శాతం నిధులు కూడా తేలేకపోయాడన్నారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ రూ. 558 కోట్లు అప్పు పెట్టి పోయాడని ఈ పాపం ఎవరిదని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
సిరిసిల్లలో నేతన్నలను బెదిరించి ఓట్ల కోసం నిధులను నిలిపివేసి, వారిని పార్టీలో కలుపుకొని రాజకీయాలు చేసింది మీరు కాదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు. నేతన్నల సమస్యపై కేటీఆర్ కు తాపత్రయం లేదని, రూ.558 కోట్లు బకాయిలు పెట్టాడని ఇందులో రూ. 352 కోట్లు బతుకమ్మ చీరల అప్పు అని 2016 – 17 నుండి ఈ అప్పులు పెరుగుతూ వస్తున్నా ఎందుకు చెల్లించలేదని, ముఖ్యమంత్రిగా మీ నాయన ఉన్నాడు కదా అని మంత్రి ప్రశ్నించారు. నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రం చూపినట్టుగా నేతన్నలను హైదరాబాదుకు పిలిపించుకొని డైనింగ్ టేబుల్ పై కూర్చోబెట్టుకొని భోజనాలు చేయించి భ్రమలు కల్పించారని… కానీ ఒక్కరోజు సంతోషపడిన నేతన్నలు తరువాత కాలమంతా బాధను మింగారన్నారు. నేతన్నలపై తమకు బాధ్యత ఉన్నదని, ఇక్కడ 393 సంఘాలు ఉంటే కేవలం 105 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. ప్రతి ఎస్ఎస్ఐ యూనిట్, మాక్స్ సొసైటీలు, ప్రతి ఒకరికి పని కల్పించాలని ఆలోచనలోనే ప్రభుత్వం ఉందన్నారు. నేతన్నలకు పని లేదు అనేది లేకుండా పూర్తి స్థాయిలో పని ఇస్తామని, ఇందుకోసం గత నెల మార్చి 11న జీవో నంబర్ ఒకటి ద్వారా రాష్ట్రంలో అన్ని వస్త్రాలను కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు. తాము నాలుగు నెలల్లోనే రూ. 120 కోట్ల ఆర్డర్లు ఇచ్చామని మంత్రి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం ఆదరించకుండా ఉన్న అద్దకం, సైజింగ్, వార్పిన్ తదితర అన్ని యూనిట్లకు పని కల్పిస్తామన్నారు. మూతపడిన అన్ని యూనిట్లను పునరుద్దరిస్తామని, వ్యవస్థను బాగు పరుస్తామని, ఇటీవల ఓల్డ్ సిటీలో కూడా పరిశీలన చేశామని, ప్రభుత్వం నేతన్నల పట్ల చాలా సీరియస్ గా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో శవాలపై పేలాలు ఏరుకున్నట్టుగానే నేతన్నల శవాలతో రాజకీయాలు చేస్తూ అమరవీరులను రెచ్చగొట్టి, ప్రాణ త్యాగాలకు ప్రేరేపించినట్టుగా నేతన్నల పట్ల వ్యవహరిస్తున్నారని, ఉద్యమంలో సామాన్యులే చనిపోతున్నారని ఆరోపించారు. నేతన్నలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని, నేతన్నల సంక్షేమం కోసం ఎవరికి కష్టం రాకుండా చూసే బాధ్యత మాదేనన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల కంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక రూపాయి ఎక్కువగానే ఇస్తామని, బకాయలు అన్ని తీరుస్తామని, నేతన్నలు నిరాశ పడవద్దన్నారు. 7 లక్షల కోట్ల బాకీలు భరిస్తున్న తమ ప్రభుత్వం నేతన్నల బకాయిలు కూడా చెల్లిస్తామని, మొదటి దశ కింద కొంత బకాయలు, రెండవ దశలో మిగిలిన బకాయలు చెల్లిస్తామని, ఇది కాంగ్రెస్ ఇస్తున్న మాట తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మాట అని అన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సిరిసిల్లపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సవాలు విసురుతూ మీరు బకాయిలు పెడితేనే ఈ పరిస్థితి సిరిసిల్లలో నెలకొన్నదన్నారు.
నేతన్నల కోసం ప్రణాళిక చేస్తున్నామని గాబరా పడవద్దని, తాము అధికారంలో ఉన్నామని, నష్టం తెస్తే తమను అడగవచ్చన్నారు. బండి సంజయ్ దీక్ష చేసే ముందు జీఎస్టీ ఎందుకు విధిస్తున్నారు, ఖాదీ బోర్డును, టెక్స్టైల్ బోర్డును ఎందుకు రద్దు చేశారు జవాబు చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఇంతకాలం ఎవరు వినతి పత్రాలు ఇస్తామన్నా అవకాశం ఇవ్వలేదని, ఆప్రకటిత కల్లోలిత ప్రాంతంగా ఉంచారని, తాము అందరి విన్నపాలు వింటున్నామన్నారు. మారుతున్న కాలానుగుణంగా నేతన్నలకు శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో మార్పు తెస్తామని, ఒక గీతన్నగా మాట ఇస్తున్నట్టు తెలిపారు. సిరిసిల్లలో 12 ఏఏవై కార్డులు ఉంటే వాటిని రద్దు చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వారికి లేదని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. వస్త్ర ప్రపంచంలో ఆదర్శంగా, మోడల్ గా సాంకేతికపరంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలలో ఇప్పటికే రూ. 80కోట్లు విడుదల చేశామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.