వరంగల్ జిల్లా అనంతసాగర్ క్రాస్ వద్ద ఇవ్వాల (సోమవారం) తెల్లవారు ఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్న దమ్ములు అక్కడికక్కడే చనిపోయారు. వారిలో పెద్దవాడు శివరాం (24) రైల్వే ట్రైనీ టికెట్ కలెక్టర్ కాగా, రెండో అబ్బాయి హరికృష్ణ (23) సాప్ట్ వేర్. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడి వారిని కన్నీరు పెట్టించాయి.
ఈ ఘోర ప్రమాదం స్థానికుల్లో కలవరం రేపింది. విషయం తెలిసిన ఎల్కతుర్తి ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై పరమేష్, హసన్ పర్తి ఎస్సై దేశిని విజయ్ కుమార్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థితిని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ పుటేజిని పరిశీలిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పాలపల్లి మనోహర్ కందుగులలో హోటల్ నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లలను కష్టపడి పెద్ద చదువులు చదివించి ప్రయోజకులను చేశాడు. పెద్దవాడు శివరాం (24) ఇటీవలే రైల్వేలో టికెట్ కలెక్టర్ కొలువుకు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ (23) హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్టు వేర్ గా పనిచేస్తున్నాడు. ఇక త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్న ఆ తల్లి దండ్రుల ఆశలు సోమవారం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో అడియాశలుగానే మిగిలాయి.
సోమవారం శివరాం, హరికృష్ణలు హైదరాబాద్ లో కొలువులో చేరడానికి కందుగుల నుంచి తెల్లవారు ఝామున 5 గంటలకు తమ ద్విచక్రవాహనం పై హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో అనంతసాగర్ క్రాసు రోడ్డు వద్ద తెల్లవారుఝామున 5:39 గంటలకు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి వేగంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.