సామంతులలాగా అధికారం కొద్ది మంది అధికారుల చేతిలో పెట్టకుండా అధికారులందరికీ పాలనలో స్వేచ్ఛను కల్పించి పారదర్శకతను తీసుకువచ్చామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ధర్నాచౌక్ వద్దు అన్న వారిని కూడా ధర్నా చేసుకోనిచ్చిన ప్రభుత్వం మాదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో రేవంత్ మాట్లాడారు.
నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంబించిన కేసీఆర్కు బుద్ధి చెప్పారన్నారు.
ప్రగతిభవన్ కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామని, ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. ఉద్యమంలో మాట్లాడిన మాటలను మర్చిపోయి కేసీఆర్ తెలంగాణ సంస్కృతిని చెరిపే ప్రయత్నం చేశారన్నారు. మేం వచ్చిన తర్వాత జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశామన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు తీసుకువచ్చి, ఆరోగ్య శ్రీ పరిమితి పెంచాం. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్,. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చామన్నారు. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరి కమిషన్(ఈఆర్సీ)లో కేసీఆర్ నాటిన గంజాయి మొక్క ఒకటి గృహజ్యోతి డబ్బులు ముందే డిస్కంలకు ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందని, ఇచ్చిన వ్యక్తి ఇంటి పేరు కూడా తన్నీరని ఎద్దేవా చేశారు. ఈ తన్నీరుకు గతంలో రైతులకు ఉచిత విద్యుత్ డబ్బులు కేసీఆర్ ముందే ఇచ్చాడో లేదా తెల్వదా… ఈ గంజాయి మొక్కలన్నింటిని సమూలంగా పీకేస్తాం’ అని రేవంత్ హెచ్చరించారు.
స్వేచ్ఛకు మించింది ఏదీ లేదు
గత ఏడాది డిసెంబర్ 3న తెలంగాణలో ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని, స్వేచ్ఛకు మించింది ఏదీ లేదని నిరూపించారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యువకుల ఆత్మబలిదానాలతో సమైక్య పాలన నుంచి విముక్తి పొంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ రాజరికపోకడలను మళ్లీ తీసుకువచ్చారు. తన వారసులే ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నారు. కేసీఆర్ నిజాం నకలునే మళ్లీ చూపించాడు. ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు. తిరుగుబాలు చేసినవారందరినీ అణచివేశాడు. దీంతో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పరిపాలనను తీసుకువచ్చారని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
కవిత అరెస్టుపై సైటర్లు…
కవిత అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మగారు లేకపోతే..బతుకమ్మ ఆగదంటూ సెటైర్లు పేల్చారు. అమ్మగారు లేరు..బతుకమ్మ ఎవరు ఆడతారు అనుకోకండి…బంతి పూలతో..బతుకమ్మ ఉండేదని తెలిపారు. అమ్మగారూ ప్లాస్టిక్ పూలతో ఆడారు….వచ్చే బతుకమ్మలో..ప్లాస్టిక్ పూలు ఉండకపోవచ్చు అంటూ ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. వారసత్వాన్ని తలపై రుద్దాలని చూసినప్పుడు తెలంగాణ సమాజం ఏకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు అధికారం నుంచి దించారన్న ఆయన నిజాం నకలునే కేసీఆర్ చూపించారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై కేసీఆర్కు నమ్మకం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఏనాడు ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ గౌరవించలేదని ఆరోపించారు.