Telangana: తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆరెస్‌లో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన సీనియర్లు మరోసారి రెన్యువల్ చేసుకునేందుకు రెడీ అవుతుంటే.. కొత్తగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు మరికొందరు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి కోసం గులాబీ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు తమ పైరవీలు షురూ చేశారు. ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ 3వ తేదీతో ముగిసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్ ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం పూర్తయిన వారిలో ఉన్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. పదవీకాలం పూర్తైన ఆరుగురిలో ఒకరిద్దరికి మాత్రమే రెన్యువల్ అయ్యే చాన్స్ ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రెన్యువల్ ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావుకు ఇప్పటికే ఒకసారి రెన్యువల్ చేసినందున ఈసారి అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.