(ప్రభ న్యూస్ – నిజామాబాద్ క్రైం) – కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం శెట్పల్లి సంగారెడ్డిలో జరిగిన తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు స్నేహితులు విందు ఏర్పాటు చేసుకున్నారు. పరస్పర విభేదాలు బయటపడి, గొడవకు దిగారు. ఆ సమయంలో ఓ వ్యక్తి తుపాకితో కాల్చడంతో, రాజు అనే వ్యక్తికి తూటా తగిలి, తీవ్ర గాయలపాలయ్యడు. వెంటనే ఇతర స్నేహితులు తేరుకొని, అత్యవసర వైద్య చికిత్సల కోసం రాజును హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నట్టు తెలిసింది.
మరోవైపు తుపాకీ కాల్పుల మోతకు గ్రామస్తులు బిత్తరపోయి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని, సంఘటనకు గల కారణాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన వ్యాపారిదిగా తెలిసింది. అయితే వీళ్లంతా ఇక్కడ ఎందుకు మకాం వేశారు. వీరి మధ్య ఏం జరిగింది. తుపాకీ కాల్పులు ఎవరు చేశారు. గన్ ఎక్కడి నుంచి వచ్చింది. తుపాకికి లైసెన్స్ ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారని తెలుస్తుంది. లేదంటే వన్య ప్రాణుల వేట కోసం వచ్చారానని ఆరా తీస్తున్నారు. బాధితుడు పిర్యాదు చేస్తే వాస్తవాలు బయట పడనున్నాయి.