పెద్దపల్లి, ప్రభన్యూస్: పంజాబ్ రాష్ట్రంలో ధాన్యం సేకరిస్తున్న తరహా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రంపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ధాన్యం సేకరించడం సరైంది కాదన్నారు. పంజాబ్‌లో రైతులు పండించిన పూర్తి వరిధాన్యంతోపాటు గోధుమలను సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాలని పేచీ పెట్టడం సరికాదన్నారు. వన్ నేషన్.. వన్ రేషన్ అంటున్న మోడీ ప్రభుత్వం వన్ నేషన్.. వన్ ప్రొక్యూరమెంట్ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలోని 61లక్షల రైతు కుటుంబాలపై కేంద్ర నిర్ణయం శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజను ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేయించుకోవాలన్నారు.
కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ద్వారా వ్యవసాయ పెట్టుబడి అందిస్తున్నారన్నారు. కాళేశ్వరం జలాల ద్వారా రైతులకు సాగు నీటి కష్టాలు తొలగిపోయి పెద్ద ఎత్తున దిగుబడి వస్తుందన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ గురువారం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రం స్పందించకపోతే గ్రామ గ్రామాన నిరసన దీక్షలు, రహదారుల దిగ్భంధాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి రైతు కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు ఎగరవేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై పోరాడతామన్నారు. ఈ సమావేశంలో తెరాస జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, గ్రంధాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్, జడ్పీటీసీ రామ్మూర్తి, ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌తోపాటు- పలువురు పాల్గొన్నారు.