Tuesday, November 26, 2024

MDK: కాంగ్రెస్, బీజేపీ రెండూ తోడు దొంగలు… హరీశ్ రావు

కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈ నెల 26న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభను దుబ్బాకలో జరుగునున్నది. ఈనేపథ్యంలో సభా ఏర్పాట్లను మంత్రి హరీశ్‌ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. సొంత పార్టీ నాయకులకే బీజేపీపై నమ్మకం లేదని, మరి ప్రజలకెలా విశ్వాసముంటుందని ప్రశ్నించారు. వారు చెప్పే మాటలన్నీ నీటిమీద రాతలేనని విమర్శించారు. బీజేపీ మ్యానిఫెస్టో ఒక అబద్ధమని విమర్శించారు. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది ఒక్క సీటేనని, ఈసారి డకౌటో లేదా ఒకటి రెండుకు సీట్లు గెలిచేది లేదన్నారు. అలాంటి పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటుచేస్తుందని సందేహం వ్యక్తంచేశారు. ప్రజల ఆకాంక్షలను ఏవిధంగా నెరవేస్తుందని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేలా, మోసం చేసేలా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని చెప్పారు. ప్రజలకు కూడా ఒక స్పష్టత వచ్చిందని, అభివృద్ధి కావాలంటే కేసీఆర్‌ రావాలన్నారు. 24 గంటల కరెంటు కావాలన్నా, కాళేశ్వరం నీళ్లు రావాలన్నా కేసీఆర్‌ రావాలంటున్నారని తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని విమర్శించారు. చేనేత కార్మికులపై జీఎస్టీ వేసిందని, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద ప్రజలకు అన్యాయం చేసే పార్టీ బీజేపీ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హ్యాండ్లూం బోర్డును రద్దు చేసిందెవరు, బీడీ కార్మికులు, నేతన్నల నడ్డి విరిచిందెవరని ప్రశ్నించారు. బీడీ కట్టలపై జీఎస్పీ వేసి కార్మికుల పొట్టమీద కొట్టిందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు బీడీ కార్మికులకు అన్యాయం చేశాయని వెల్లడించారు. బీడీ కట్టలపై పుర్రెగుర్తు పెట్టిన కాంగ్రెస్‌ పార్టీకి, జీఎస్టీ వేసిన బీజేపీకి బీడీ కార్మికులను ఓట్లడిగే నైతిక హక్కులేదన్నారు. రెండు పార్టీలు బీడీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేశాయని పేర్కొన్నారు. కానీ నెలనెలా రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చి సీఎం కేసీఆర్‌ వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే బీడీ కార్మికుల పెన్షన్‌ రూ.5 వేలకుపెంచుకోబోతున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement