బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పార్టీ శ్రేణులకు ట్వీట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవునా రాజీనేని రణమని చెప్పారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అందుకున్న స్వీయ రాజకీయ పార్టీ అని చెప్పారు.
గులాబీ పార్టీ ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. తెలంగాణ మట్లిలో పుట్టిన ఇంటి పార్టీ, ఈ నేల మేలుకోరే పార్టీ బీఆర్ఎస్. పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్న మీకు ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘రెపరెపలాడే గులాబీ పతాకం, తెలంగాణ ఎగరేసిన జయ కేతనం. పర పీడన చెర విడిపించిన ఉద్యమ జెండా. పసిడి కాంతులు పంచిన ఉజ్వల ప్రగతి బావుటా. పుట్టుకే ఒక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం. ఆత్మగౌరవ మెరుపులు, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న స్వీయ రాజకీయ అస్తిత్వ చైతన్యం. జలదృశ్యంలో ఉదయించి, ఉర్రూతలూగించే ఉద్యమ దృశ్యాలను ఆవిష్కరించి, స్వరాష్ట్రం సాధించి.. సస్యశ్యామల సన్నివేశాలను సృష్టించి గమ్యాలను ముద్దాడిన గమనం.
అమేయం..అజేయం..అనితర సాధ్యం గులాబీ పరివర్తన ప్రస్థానం. ముళ్లూ రాళ్లూ అవాంతరాలను అధిగమిస్తూ పరవళ్లు తొక్కిన పయనం. చావునోట్లో తలబెట్టి సాహసంగా పోరాడిన దళపతి.. లాఠీలకు, జైళ్లకు వెరవక కొట్లాడిన గులాబీ సైనికుల త్యాగ నిరతి. ఆటుపోట్లను చూసి అదిరిపడలేదు, ఎదురుదెబ్బలకు బెదిరిపోలేదు, గెలిస్తే పొంగిపోలేదు, ఓటములకు కుంగిపోలేదు. జయాపజయాలకు అతీతమైన స్థిత ప్రజ్ఞత. ఆకులురాలే శిశిరంలో, ఆకుపచ్చని వసంతంలోనూ ఒకటే నిబద్ధత.
వేయి దాడులు.. లక్ష కుట్రలు, విష ప్రచారాలు, విచ్ఛిన్న పన్నాగాలను ఎదిరించి నిలిచిన సత్తా. దండి గుండె దళపతి నెత్తురు మండి ఎత్తిన జెండా. ఏ పాత్రలో వున్నా జనమే ఎజెండా. మొన్నటి పోరాటం ప్రపంచానికే పాఠం, నిన్నటి పాలన దేశానికే నయా నమూనా. నేడు.. ప్రజాపక్షంవహించే సమర్థ ప్రతిపక్షం.
తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ, ఈ నేల మేలుకోరే భూమి పుత్రుల పార్టీ. ఇది పేగు తెంచుకున్న ప్రేమ బంధం. సమరంలో, సంబురంలో కష్ట సుఖాలను కలబోసుకున్న అనుబంధం. తెంచలేని తుంచలేని జన్మజన్మాల సంబంధం. మనమే తెలంగాణ దళం, మనమే తెలంగాణ గళం. జెండా మోసి.. జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం బలగం. కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న మీ పట్టుదలకు, మీ శ్రమకు, మీ కృషికి సదా సలాం.. ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం. భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.