హైదరాబాద్: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామీణం ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. నేడు వెంకయ్యనాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన మూడు పుస్తకాలను వర్చువల్‌గా ప్రధాని విడుదల చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో కార్యక్రమం నిర్వహించారు. ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ’13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. ”వెంకయ్యనాయుడితో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కింది. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారు. అత్యయిక పరిస్థితి వేళ ఆయన పోరాడారు. 17 నెలల జైలు జీవితం గడిపారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖలో వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛభారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు” అని మోదీ కొనియాడారు.