Friday, November 22, 2024

TG | హామీలు నెర‌వేర్చ‌కుండా బుకాయింపు.. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌
రెండూ కుటుంబ పార్టీలే


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ప్రజలను కాంగ్రెస్ పార్టీ వంచనకు గురిచేసిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమ‌వారం హైదరాబాద్‌ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం బుకాయిస్తుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోపు అమలు చేస్తామని చెప్పారని, నేటికీ అందులో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేకపోయారన్నారు.

ఆ హామీలు ఏమ‌య్యాయి ?
ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన రాహుల్‌‌ గాంధీ, సోనియా‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీతో సహా ఆ పార్టీ నేతలంతా విచ్చలవిడిగా హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం ప్రజలను వంచించారని ఆరోపించారు. కేవలం డిక్లరేషన్లు, గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ జనాలను నిలువునా మోసం చేసింద‌ని ధ్వజమెత్తారు. తెలంగాణ తో సహా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితులు ఇలానే ఉన్నాయని ఎద్దేవా చేశారు.

- Advertisement -

రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన బీఆర్ఎస్‌…
మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని కిష‌న్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో పయనిస్తుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రెండు కుటంబ పార్టీలేనని.. దొరికిన చోటు అప్పులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిప‌డ్డారు. అప్పులు తీర్చడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. కొన్నాళ్లకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఎంతో దూరంలో లేదని కిషన్‌రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement