ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – యువ సాహిత్య రత్న, ప్రముఖ సామాజిక రచయిత కడియాల సురేష్ కుమార్ రాసిన ఆదివాసుల ఆత్మ బంధువు సీతక్క పుస్తకాన్ని బుధవారం నాడు ప్రజా భవన్ లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ – సీతక్క ఆవిష్కరించారు. తన జీవిత చరిత్ర పై పుస్తకం రాసి తన తల్లిదండ్రులకు అంకితం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ములుగు ప్రాంత వాసి స్వశక్తితో ఎదిగిన సురేష్ మంచి రచయితగా గుర్తింపు పొందాలని ఆకాంక్షిస్తూ శాలువాతో సన్మానించారు.
సీతక్క జీవితం,ఉద్యమం, పోరాటాల గురించి అనేక వివరాలు సేకరించి రచయిత సురేష్ కుమార్ తన పుస్తకం లో పొందుపరచారు. ఈ పుస్తకానికి లోకసత్తా వ్యవస్థాపకులు డా. జయ ప్రకాష్ నారాయణ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి. కాశీం, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు ముందుమాట రాసారు. ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంగం మహిళా నాయకురాలు మాహియా రాజ్, సుష్మ కుమారి తదితరులు పాల్గొన్నారు.