Friday, November 22, 2024

KTR: బొంద పెట్టే సంగ‌తి త‌ర్వాత‌…. ముందు వంద రోజుల‌లో హామీలు అమ‌లు చేయండి…రేవంత్‌కు హిత‌వు

హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్ర‌కారం ఈ జ‌న‌వ‌రి నుంచి ఎవ్వ‌రూ క‌రెంటు బిల్లులు క‌ట్టొద్ద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్ప‌ష్టం చేశారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన పార్టీ నేత‌ల భేటీలో ఆయ‌న ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ జనవరి నుంచి కరెంటు బిల్లులు ఎవరూ కట్టవద్దని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇక‌.. 100 మీటర్ల లోపల బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే సంగతి తర్వాత చూద్దాం.. వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలపై దృష్టిపెట్టాల‌ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అహంకారంతో మాట్లాడిన సీఎం రేవంత్‌ వంటి నేతలను తమ పార్టీ చాలామందిని చూసిందని చురకలంటించారు. తెలంగాణ భవన్‌లో శ‌నివారం సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ‘తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్’ అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చినందుకా? అని నిల‌దీశారు.

ఎన్నిక‌ల త‌ర్వాత ఆ రెండు పార్టీలు క‌లిసిపోతాయి..
పార్లమెంట్ ఎన్నికల తర్వ‌త కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతాయని కేటీఆర్ కామెంట్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతారని, రేవంత్ రక్తం అంతా బీజేపీదే అన్నారు. ఇక్కడ చోటా మోడీగా రేవంత్ మారారన్నారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నార‌ని ఎద్దేవా చేశారు. స్విట్జర్లాండ్‌లో రేవంత్ రెడ్డి అదానితో అల‌య్ బ‌ల‌య్ చేసుకున్నార‌ని, అదాని, రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలన్నారు. రాహుల్ గాంధీ ఏమో అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే.. ఈరోజు రేవంత్ ఆదాని కోసం అర్రులు చాస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.

ట్రిపుల్ ఇంజ‌న్ గా రేవంత్
డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్‌గా మారార‌ని, మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు 2500 వెంటనే ఇవ్వాల‌న్నారు. ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేద‌న్నారు. బీజేపీతో బీఆర్ఎస్ కు ఏరోజు పొత్తు లేద‌ని, భవిష్యత్తులోనూ ఉండద‌న్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు 5 ఏండ్లలో ఏం చేసిండో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిప్ట్ లను జాతికి అకింతం చేశారని ఎద్దేవా చేశారు. ఇదే అయన చేసిన అతిపెద్ద పని అని, కేసీఆర్ అధ్వ‌ర్యంలో 36 ప్లైఒర్లు కడితే.. ఉప్పల్, అంబర్ పేట ప్లై ఒవర్లు సంవత్సరాలైనా కట్టలేక చేతులెత్తేర‌ని ఏకిప‌డేశారు.

ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌కు కృత‌జ్ఞ‌త‌లు ..

శాసనసభ ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా అని పార్టీ ముఖ్య నేత కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలో గులాబీ జెండాకు ఎదురులేదని, బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వానికి అపూర్వమైన మద్దతు ఇచ్చిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకున్నది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీనే అని, బీఆర్ఎస్ వల్లనే బీజేపీ సీనియర్ నాయకులు పోటీకి వెనుకంజ వేశార‌న్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు. ఓడినా గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమే అంటూ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -

50 రోజుల పాల‌నలో రైతులు.. ఆటో డ్రైవ‌ర్ల ఆత్మ‌హ‌త్య‌లు

కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింద‌న్నారు కేటీఆర్‌. రైతులు కూడా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. రైతన్నలకు రైతుబంధు అందడం లేదు, మహిళలకు వాగ్దానం చేసిన 2500 రావడం లేదు.. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా తప్పించుకునే యత్నం కాంగ్రెస్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలు అని ప్రజలు గుర్తుంచుకోవాలి. వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడుతాం.. అంటూ కేటీఆర్ చెప్పారు.


ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, దానం నాగేందర్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement