లాల్ దర్వాజాలో ఘనంగా బోనాలు
బోనాలు సమర్పించే మహిళలకు ప్రత్యేక క్యూ
2000 మందితో భారీ పోలీసు బందోబస్తు
పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు
భాగ్యలక్ష్మి దేవాలయానికి పట్టువస్త్రాలు
సమర్పించిన మంత్రి కోమటి రెడ్డి
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ : ఆషాడమాసం బోనాలు సందర్భంగా ఈ వారం పాతబస్టీ లాల్ దర్వాజాలో బోనాలు పండగ జరుగుతుంది. దీంతో పాతబస్తీలో పండగ వాతావరణం నెలకొంది. లాల్ దర్వాజాలోని సింహవాహిని మహాంకాళి అమ్మవారి, అలాగే అక్కన్న, మాదన్న ఆలయాలు వద్ద ఉదయం నుంచే భక్తులు చేరుకుని బోనాలు సమర్పిస్తున్నారు. భారీ సంఖ్యలో నగర ప్రజలు వచ్చి మహంకాళీ అమ్మవారితోపాటు అకన్న, మాదన్నలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఆ రెండు ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది.
పట్టువస్త్రాలు సమర్పించిన డిప్యూటీ సీఎం
పాతబస్తీ లాల్ దర్వాజాలో బోనాలు పండగ సందర్భంగా సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరుఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వద్ద భట్టి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనలతోపాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు.
ప్రత్యేక క్యూ ద్వారా బోనాల సమర్పిస్తున్న మహిళలు
అమ్మవారికి బోనాలు సమర్పించడం కోసం మహిళలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రత్యేక క్యూ లైన్ ద్వారా అమ్మవారి ఆలయానికి వెళ్లి మహిళలు బోనాలు సమర్పిస్తున్నారు. భక్తుల తోపులాట లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అక్కన్న, మాదన్న ఆలయంలో కూడా మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
2000 మందితో భారీ బందోబస్తు
పాతబస్తీలో పండగ సందర్భంగా సుమారు రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. బోనాల నేపథ్యంలో ఫలక్ నుమా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్ పురా, పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాలతోపాటు నయాపూల్ నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సింహవాహిని శ్రీ మహాంకాళి లాల్ దర్వాజా టెంపుల్ రోడ్ వైపు నెహ్రూ విగ్రహం లాల్ దర్వాజా నుంచి ట్రాఫిక్ అనుమతించడం లేదు. హిమ్మత్ పూరా, షంషీర్ గంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు మళ్లించారు. చాంద్రాయణగుట్ట, కందికల్ గేట్, ఉప్పుగూడ వైపు నుంచి వచ్చే వెహికిల్స్ ను లాల్ దర్వాజా వైపు అనుమతించడం లేదు. ఛత్రినాక ఔట్ పోస్ట్ దగ్గర గౌలిపుర, నాగుల చింత వైపు వాహనాలను మళ్లిస్తున్నారు.
భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన కోమటిరెడ్డి
చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వద్ద కోమటిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనలతోపాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు.
అంబర్‌పేటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి….
అంబర్‌పేటలో మహాంకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
మైసమ్మ దేవాలయంలో మంత్రి సురేఖ ప్రత్యేక పూజలు
హైదరాబాద్ పాతబస్తీలో ఘనంగా బోనాల వేడుక జరుగుతుంది. ఈ సందర్భంగా చిలకలగూడ కట్ట మైసమ్మ అమ్మవారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.