హైదరాబాద్, ఆంధ్రప్రభ: త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడులో టీఆర్ఎస్ ప్రచారం స్పీడందుకుంది. పార్టీ నియమించిన ఇన్చార్జిలు నియోజకవర్గంలోని గ్రామగ్రామాన పర్యటించి ప్రజలను స్వయంగా కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం చౌటుప్పల్‌లో రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ బొల్లం సంపత్‌కుమార్ గుప్తా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములుతో పాటు ఆయన ఓటర్లను కలిసి టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
ఆసరా పెన్షన్లు, రైతుబంధు, దళితబంధు లాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌కే ఈ ఉప ఎన్నికలో మద్దతివ్వాలని స్థానికులను కోరారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే మునుగోడుకు ఒరిగేది ఏమీ లేదన్నారు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి శుద్ధి చేసిన తాగు నీరు ఇచ్చి ఫ్లోరోసిస్ రక్కసిని పారదోలింది సీఎం కేసీఆరేనని ఈ సందర్భంగా ఓటర్లకు సంపత్‌కుమార్ గుప్తా గుర్తు చేశారు.
భారీ మెజార్టీ కోసం ఆర్యవైశ్యులు కృషి చేయాలి..
ఇంటింటి ప్రచారానికి బయలుదేరేముందు మునుగోడులోని నారాయణపూర్ మండలంలో జరిగిన ఆర్యవైశ్య ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న సంపత్‌కుమార్ గుప్తా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉప ఎన్నికలో ఆర్యవైశ్యులంతా కలిసి కట్టుగా టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.