Monday, November 18, 2024

Bodhan – విప‌క్షాల‌ది ఓట్ల బంధం – మ‌న‌ది పేగు బంధం … ఎమ్మెల్సీ క‌విత

బోధ‌న్ – వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి యాత్రకు పోయినట్లుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణలో రూ.4వేల పెన్షన్ ఇస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీపై స్పందిస్తూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రూ.4వేల పెన్షన్‌ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే మన ఇంటి పార్టీ అని అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బూత్‌ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావం పూరించారు..

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు ఇప్పుడు కారు.. కేసీఆర్ గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రతి కులానికి తాము ఆత్మగౌరవ భవనం నిర్మించామన్నారు. కులమతాలకు తావులేకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని, కానీ కేంద్రంలో డెమోక్రసీ ప్రమాదంలో ఉందన్నారు. గులాబీ జెండా ఉత్సాహాన్ని బోధన్ ప్రజలు మరోసారి చూపించారన్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. బోధన్‌లో 10వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్నామని, 152 చెరువులను బాగు చేసుకున్నామన్నారు. నిజామాబాద్‌కు ఐటీ హబ్‌ తీసుకొచ్చామన్నారు. ఇక్కడికి గూగుల్, ఇన్ఫోసిస్ కంపెనీలనూ తీసుకువస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement