పలు ప్రాంతాల్లో ప్రమాదాలు
ఇస్నాపూర్ వద్ద ఇద్దరు మృతి
నిమజ్జనంలో అపశ్రుతి, ఒకరి మృతి
వేర్వేరు ఘటనల్లో పలువురికి గాయాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, నెట్‌వర్క్ : తెలంగాణలో బుధవారం ఒక్కరోజే పలుచోట్ల యాక్సిడెంట్లు జరిగాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. చిట్కుల్ గ్రామానికి చెందిన కూలీ వెంకటేశ్, ఇదే గ్రామానికి చెందిన రమేశ్, మల్లేశ్ బైక్ పై వెళుతుండగా ఎస్బీఐ బ్యాంక్ చౌరస్తాలో ఇన్సిడెంట్ జరిగింది.
జాతీయ రహదారి దాటుతుండగా పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే లారీ వెనుక నుంచి వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని పటాన్‌చెరు ఆస్పత్రిలో వైద్యసేవలు అందించి సంగారెడ్డికి తరలించారు. సంగారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమేశ్ చనిపోయాడు. మల్లేశ్‌కు స్వల్పగాయాలయ్యాయి.
చెరువులో పిండప్రదానం చేస్తుండగా..
వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారం గ్రామంలో లక్ష్మణ అనే వ్యక్తి పిండ ప్రదానం చేస్తుండగా ప్రమాదశావత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. లక్ష్మణ్ పెదనాన్న కుమారుడి దశదినకర్మ కార్యక్రమం ముగిసిన తర్వాత చెరువులో పిండ ప్రదానం చేయడానికి ఆయన వెళ్లాడు. కాలుజారి నీటిలో మునిగిపోవడం… అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. స్ధానిక సమాచారంతో ఘటనా స్థలికి చెందిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
స్కూటీపై వెళుతున్న యువతి…
నాచారం హెచ్ఎంటీ నగర్ వద్ద స్కూటీపై వెళుతున్నఓ యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఆమె డ్రైవ్ చేస్తున్న స్కూటీని గ్యాస్ లారీ ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడిక్కడే మృతిచెందింది. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.
స్కూటర్‌పై దంపతులు వెళ్తుంటే..
మేడ్చల్ లో దంపతులు స్కూటర్‌పై వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీకొనడంతో భార్య మృతి చెందారు. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. మృతిచెందిన ఆమె మేడ్చల్ పట్టణంలోని కేఎల్ ఆర్ వెంచర్ కు చెందిన రత్నం (55)గా గుర్తించారు. గాయపడిన మాధవరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిమజ్జనంలో అపశ్రుతి…
కొమరంభీం జిల్లా వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కాగజ్‌నగర్ పెద్దవాగు వద్ద క్రేన్ ప్రమాదంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు లింగంపల్లి నగేష్ (50) మృతిచెందాడు. మరో కార్మికుడు ప్రేమ్ గాయపడ్డారు. దీంతో నిమజ్జనం కార్యక్రమం విధులను మున్సిపల్ కార్మికులు బహిష్కరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు కార్మికులు ఆరోపించారు.