Thursday, November 21, 2024

రక్తదానం మరొకరికి ప్రాణదానం: పెద్దపల్లి ఎమ్మెల్యే

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ జాతిపిత అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం జూలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఆరు దశాబ్ధాల కల నెరవేర్చిన కేసీఆర్‌ బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, దళితబంధులాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కాళేశ్వరం జలాలతో తాగు, సాగు నీటి సమస్యను పరిష్కరించారన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తూ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే రూ. 5 లక్షలను రైతుబీమా ద్వారా వారం రోజుల్లో బాధిత కుటుంబానికి అందిస్తున్నామన్నారు. విద్య, వైద్యం కోసం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. దశాబ్ధాల కాలంగా జరగని అభివృద్ధిని నియోజకవర్గంలో ఏడేళ్లలో చేపి చూపించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement