ఉమ్మడి మెదక్ బ్యూరో, (ప్రభ న్యూస్) : ఎన్నికలు సమీపిస్తే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు రంగురంగుల మాటలు చెప్తారు.. వారిని నమ్మొద్దు.. వారి మాటలు నమ్మొద్దు.. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరి పెళ్లికైనా రూ.10వేల ఆర్థిక సహాయం చేశారా.. అంటూ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో 12 లక్షల మంది పెళ్లిలకు హార్థిక సాయం అందజేశామని, సద్దితిన్న రేవు తలవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆశీర్వదించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ఇతోధికంగా సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నట్లు, సద్దితిన్న రేవు తలచి పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దీవించాలని లబ్ధిదారులను కోరారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ పరిధిలోని సిద్ధిపేట రూరల్-37, చిన్నకోడూర్-42, నంగునూరు-41, నారాయణరావుపేట-33 మొత్తం 153 మందికి సీఎంఆర్ఎఫ్, నంగునూరు మండలానికి చెందిన 49 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకం యావత్ ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని హరీశ్ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందు రెక్కాడితే గాని డొక్కాడని పేదలు తమ ఆడబిడ్డల పెళ్లి కోసం అప్పులు చేసి, ఆ అప్పులకు మిత్తిలు కట్టి అనేక ఇబ్బందులు పడే వారన్నారు. ఈ ప్రపంచంలో గొప్ప దేశాలైన అమెరికా, చైనా, రష్యాలో కానీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఇంటి మేనమామగా మారి ఆడబిడ్డ పెళ్లికి రూ1,00,116/- కానుక అందిస్తున్నామని హరీశ్ రావు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉన్నదో.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎలా మారిందో.. మీరే గమనించాలని సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆసుపత్రి వైద్యంకై వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టలేని నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉడుతా భక్తి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందిస్తున్నట్లు హరీశ్ రావు స్ఫష్టం చేశారు.