కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ ను సైతం వైరస్ వదలడంలేదు. దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్, ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారినపడుతున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, బ్లాక్ ఫంగస్ కలవరపెడుతోంది.
ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన పోలీసులను బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. చిలకలగూడ పీఎస్ కానిస్టేబుల్ కు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. ప్రస్తుతం కానిస్టేబుల్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నార్త్ జోన్ పరిధిలో మొట్టమొదటి బ్లాక్ ఫంగస్ కేసు ఇదే. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పోలీసులు సైతం కరోనాతో మృతి చెందారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు హైదరాబాద్ పోలీసులు నిద్రాహారాలు లేకుండా విధులు నిర్వహించారు. కంటెయిన్ మెంట్ జోన్లలో ప్రజలు బయటకు రాకుండా చూసుకోవడం నుంచి కొవిడ్ మృతుల అంత్యక్రియల వరకూ నిర్విరామంగా శ్రమించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే అత్యధికంగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పోలీసు ఉన్నతాధికారులు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు.