హైదరాబాద్, ఆంధ్రప్రభ : మునుగోడులో ఈనెల 21న జరిగే బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. మునుగోడు సభలో కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఏ విధంగా పోరాటం చేయాలనే అంశాలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశా నిర్దేశం చేస్తారని ఆయన వెల్లడించారు. బుధవారం మీడియాతో తరుణ్ చుగ్ మాట్లాడారు.. మునుగోడు సభలోనే తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని ఆయన ప్రకటించారు. అలాగే ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆయన ఆరోపించారు.
రెండు రోజులుగా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు టిఆర్‌ఎస్ ప్రయత్నిస్తోన్నదని ఆయన విమర్శించారు. పార్టీ కేంద్ర ఆదేశాల మేరకు తెలంగాణలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర నిర్వహిస్తోన్న బండి సంజయ్‌పై టిఆర్‌ఎస్ నేతలు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మునుగోడులో ప్రజా మద్దతు బీజేపీకే ఉందని, అక్కడ తప్పక విజయం సాధిస్తామని తెలిపారు.