హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాజకీయం ప్రస్తుతం సెప్టెంబర్ 17వ తేదీ చుట్టూ తిరుగుతోంది. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందనే సంకేతాలను ఆ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. తద్వారా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెక్ పెట్టేలా భారీ వ్యూహాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కూడా అదే రోజు భారీ కార్యక్రమాలను చేపడుతుండటంతో బీజేపీ సైతం వాళ్లకు ధీటుగా పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది.
ఈ సభకు అమిత్‌షాను లేదా రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. గురువారం నాడు రాష్ట్ర నేతలతో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈమేరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంతో పాటు బహిరంగ సభను కూడా నిర్వహించాలని కిషన్ రెడ్డితో నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆరోజు ఉదయం పూట తమ తమ పోలింగ్ బూతుల్లో జాతీయ జెండాను ఎగురవేసి సాయంత్రం సభకు వచ్చే విధంగా కార్యక్రమం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి జనసమీకరణ చేయనున్నారు.
ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడానికి బీజేపీ సిద్ధమైంది. అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్… వీరిద్దరిలో ఒకరు ఖచ్చితంగా సభకు వస్తారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న తెలంగాణ విమోచన దినోత్సవం నాడు, తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని బీజేపీ భావిస్తుంది. విమోచన దినోత్సవం నిర్వహించకపోవడానికి అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీలే కారణమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కమలనాథులు చూస్తున్నారు. గత ఏడాది అనూహ్యంగా కేంద్రం అధికారికంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.