Saturday, November 23, 2024

రాహుల్‌సభను మరిపించేలా బీజేపీ ప్లాన్‌.. ఏర్పాట్లలో నిమగ్నమైన నేతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భండి సంజయ్‌ చేపట్టనున్న మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్‌ ఖరారైంది. దీంతో మొదటి నుంచీ యాత్రపై క్షేణుల్లో నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఎప్పటి నుంచి యాత్ర మొదలవుతుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది. ఎక్కడ ముగుస్తుందన్న విషయాలన్నీ ఖరారయ్యాయి. ముగింపు సందర్భంగా వరంగల్‌లోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించేందుకు నాయకత్వానికి ఇప్పటి నుంచే బాధ్యతలను అప్పగించారు. వరంగల్‌లోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో బహిరంగసభను కొద్ది నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా రాహుల్‌గాంధీ బహిరంగ సభలో సంగించారు. ఈ సందర్భంగా రైతు డిక్లరేషన్‌ను కూడా ప్రకటించారు. గతంలోరాహుల్‌ సభ జరిగిన ప్రాంగణంలోనే సంజయ్‌ 3 వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించనున్నందున కాంగ్రెస్‌ జన సమీకరణ కంటే ఎక్కువగా జనాలను సమీకరించాలని పార్టీ లక్ష్యంగా నిర్ధేశించింది. రాహుల్‌సభను తలదన్నేలా జనం రావాలి, ఏర్పాట్లు కూడా అంతకు రెట్టింపుగా ఉండాలన్న లక్ష్యంతో ఉన్నామని పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన సభ కంటే రెండింతల జనం సభకు తరలి వచ్చేలా చూడాలని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన నేతలకు నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీని పరిగణనలోకి తీసుకోకూడదని, తుక్కుగూడ సభతో ప్రజల్లో మొదలైన చర్చ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగసభతో మరింత వేడెక్కిందని, ఈ రెండింటినీ మరిపించే విధంగా వరంగల్‌ సభపై ప్రజల్లో చర్చ జరగాలని పార్టీ ఆదేశంగా నేతలు పేర్కొంటున్నారు. వరంగల్‌ సభతో మరోసారి అధికార టీఆర్‌ఎస్‌లో గుబులు పెరగాలన్నది పార్టీ ఉద్దేశమని అంటున్నారు. జాతీయకార్యవర్గ సమావేశాల నేపథ్యంలో సికింద్రాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభను మరిపించే విధంగా రాహుల్‌గాంధీతో త్వరలోనే రాష్ట్రంలో భారీ బహిరంగసభను నిర్వహించి సత్తా నిరూపిస్తామని ఆ పార్టీ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి ముందడుగు లేదు. సభ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎక్కడ నిర్వహిస్తారన్న అంశంపై కూడా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మరో సభను నిర్వహించి కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు మరోసారి ధీటైన జవాబివ్వాలని బీజేపీ భావిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement