హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భాజపా జెండా ఎగురవేస్తామని కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
”తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన తుడిచిపెట్టాలని ప్రధాని మోడీ చెప్పారు. రెండు, మూడు స్థానాల కోసం భారాస, కాంగ్రెస్ పోటీపడాలి. అధికారాన్ని, డబ్బును ఉపయోగించి కేసీఆర్ ఎన్నికలకు వెళ్తున్నారు. సకల జనుల పాలన తెలంగాణలో రావాలి. భాజపాతోనే సకల జనుల పాలన సాధ్యం. ఎన్నికలకు భాజపా సిద్ధంగా ఉంది. మంగళవారం ఆదిలాబాద్‌లో పార్టీ బహిరంగ సభ జరగబోతోంది. ఎన్నికల్లో భాజపాను ప్రజలు ఆశీర్వదించాలి” అని కిషన్ రెడ్డి కోరారు.
సీనియర్ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ”ఎంపీ, ఎమ్మెల్యేలను అంగట్లో సరకులా అమ్ముతున్నారు. ఎన్నికలను డబ్బుమయం చేసింది కేసీఆరే. ఒక్కో నియోజకవర్గంలో రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఖర్చు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. తమకు ఓటేస్తేనే దళితబంధు, పింఛన్ వస్తుందని భారాస నేతలు భయపెడుతున్నారు. భాజపా లేకుండా తెలంగాణ వచ్చేది కాదు” అని ఈటల వ్యాఖ్యానించారు.