Friday, November 22, 2024

BJP Vijaya Sankalpa Sabha – అబ‌ద్దపు హామీల‌లో ప్ర‌పంచ రికార్డ్ కెసిఆర్ దే – అమిత్ షా

గ‌ద్వాల్ – కేసీఆర్ అబద్ధహామీల్లో ప్రపంచ రికార్డు సృష్టించారని, బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వక తప్పదని, రిటైర్ మెంట్ కాలం వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెణుకులు చెరిగారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు లక్ష్యంగా మాటలు తూటాలు పేల్చారు. తెలంగాణ జోగులాండ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్స సభలో అమిత్షా అమితోత్సాహంగా ప్రత్యర్థి పార్టీలను తూర్పార బట్టారు. గద్వాల సభలో అమిత్ షా మాట్లాడుతూ, తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని వివరించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ పార్టీలు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాయని , బీజేపీకి అవకాశం ఇస్తే బీసీనే సీఎం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. జోగులాంబ ఆలయం అభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారని, ప్రధాని మోదీ రూ.70 కోట్లు మంజూరు చేస్తే.. ఒక్కరూపాయి ఖర్చు చేయలేదు. గద్వాల పేదలకు 500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా కేసీఆర్‌ మోసం చేశారు. అబద్ధపు మాటలతో కేసీఆర్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది.. బీజేపీ టైం వచ్చింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది” అని అమిత్ షా ఊరించారు.

”కేసీఆర్‌ హయాంలో స్కామ్‌లు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, మద్యం కుంభకోణాలు వెలుగు చూశాయి. దేశంలోనే కేసీఆర్‌ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసం చేశారు అని అమిత్షా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కాంగ్రెస్‌ పార్టీ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసింది. కాంగ్రెస్‌ హయాంలో ఉమ్మడి ఏపీకి రూ. 2 లక్షల కోట్లు ఇస్తే.. కేవలం తెలంగాణకే మోదీ ప్రభుత్వం రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చింది. కానీ, కేసీఆర్‌ ప్రభుత్వం నిధుల్ని వినియోగించలేదు” అని అమిత్ షా ఆరోపించారు.
”కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం అంతా ఒక్కటే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు బీసీలకు టికెట్లు ఇవ్వలేదు. ఇవి బీసీ వ్యతిరేక పార్టీలు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది. బీజేపీకి ఓటేస్తే.. బీసీని సీఎం చేస్తాం. ఒక బీసీని ప్రధానిని చేసిన పార్టీ బీజేపీ. కేంద్రంలో 20 మందికిపైగా ఓబీసీలను మంత్రులను చేశాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తాం. ఆ రద్దు రిజర్వేషన్లు ఎస్టీలకు, ఓబీసీలకు ఇస్తాం అని అమిత్షా రెచ్చిపోయారు.

తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ సర్కారు చెలగాటమాడుతోంది. పేపర్‌ లీకేజీతో ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అని ఊరించి నిరుద్యోగులను బీఆర్ఎస్ స్రభుత్వం మోసగించిందని అమిత్షా ఆవేశం వ్యక్తం చేశారు.
ఇక ఎంఐఎంకి లొంగిపోయి..తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదు. బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్‌ 17న అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహిస్తాం. బీజేపీ అభ్యర్థులకు గెలిపించండి. బీజేపీని గెలిపిస్తే.. అయోధ్య రామ మందిరంలో ఉచిత దర్శనం కల్పిస్తాం” అని అమిత్ షా రామభక్తులను ఊరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement