Monday, November 18, 2024

30 నుంచి బిజెపి ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో అధికారం లోకి రావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో స్పీడ్‌ పెంచింది. ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రాలపై కమలనాథులు ఒక క్లారిటీ-కి వచ్చేశారు. యువతను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి కోసం డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ప్రధాన నినాదాలతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం అజెండాను అధిష్టానానికి పంపించి ఆమోదం పొందారు. 9 ఏళ్ల పరిపాలనలో ప్రధాని మోదీ సాధించిన విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం మే 30 నుంచి జూన్‌ 30 వరకు ‘మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌’ కార్యక్రమం చేపట్టనున్నారు.

కొలువులు కావాలంటే కమలం రావాలని, రాష్ట్ర యువత బీజేపిీ వైపు నిలవాలన్న పిలుపుతో కార్యాచరణ సిద్దం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామన్న ధీమాను పేద వర్గాల్లో కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం కేడర్‌ను సంసిద్ధం చేసింది. ఖాళీగా ఉన్న 25 వేలకు పైగా టీ-చర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని భరోసా కల్పిస్తూ అన్ని నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలకు విధివిధానాలు రూపొందించారు.

తెలంగాణ ఎన్నికల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుం దని ప్రచారం చేయనున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ ఉంటే.. డబుల్‌ ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరుతాయని క్షేత్రస్థాయిలో నినదించనున్నారు.

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ఒక్కటేనన్న ప్రచారం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ ఒక్కటే అనే అంశాన్ని పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది బీజేపీ. దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడులో ఉపఎన్నికల్లో డిపాజిట్‌ కూడా రాని కాంగ్రెస్‌ ఎట్టిపరిస్థితు ల్లోనూ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాదన్న గట్టి నమ్మకాన్ని కేడర్‌కు, కార్యకర్తలకు నూరిపోస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.
బీఆర్‌ఎస్‌ వీక్‌గా ఉన్న సెగ్మెంట్లలో కేసీఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల్ని ప్రోత్సహిస్తున్నారన్న సంకేతాల నేపథ్యంలో భాజపా కూడా గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు చప్లాన్‌ చేస్తోంది.

- Advertisement -

ఈ మధ్యకాలంలో తెలంగాణ బీజేపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లు- కనిపిస్తోందనీ, కలిసికట్టుగా పనిచేయకుంటే వేటు తప్పదని అధిష్టానం తీవ్రస్థాయిలో హెచ్చరించిన నేపథ్యంలోనే రాష్ట్ర నాయకులంతా అలర్ట్‌ అయ్యారు. నేతలంతా క్రమశిక్షణతో ఉండటం కూడా చాలా ముఖ్యమని అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఇక వచ్చే నెలలో రెండు భారీ బహిరంగ సభలకు ప్లాన్‌ చేస్తోంది రాష్ట్ర బీజేపీ. ఓ సభకు అమిత్‌షా మరోసభకు జేపీ నడ్డా హాజరవుతారని తెలుస్తోంది. ఈసారి తెలంగాణాలో జరిగే సార్వత్రిక ఎన్నికలను బీజేపీ అధిష్టానం ఛాలెంజ్‌గా తీసుకున్న నేపథ్యంలో ఈసారి తెలంగాణలో సింగిల్‌గానే అధికారంలోకి వస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement