Saturday, November 23, 2024

ఏపీ, తెలంగాణపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​.. టీడీపీ, వైసీపీ నుంచి భారీగా వలసలుంటయ్​: జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ ఇంకా అధికారంలోకి రాని రాష్ట్రాలపై ఫోకస్ పెడుతున్నామని, అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉంటాయని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణా నుంచి చాలామంది నాయకులు తమను సంప్రదిస్తున్నారని శుక్రవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీ, టీడీపీల నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని జీవీఎల్ అన్నారు. టచ్ చేసి చూడు కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టనుందని, ఇందులో భాగంగా ఏపీలోని అన్ని పార్టీల నేతలను బీజేపీ టచ్ చేయనుందని ఆయన వెల్లడించారు. దీనితో బీజేపీలో చేరికలు విస్తృతం కానున్నాయని ఆయన అన్నారు. ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు మోడీ హవాను రుజువు చేశాయని ఎంపీ జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హవా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండనుందన్న ఆయన… 404 పార్లమెంట్ సీట్ల టార్గెట్‌కు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఉత్తుత్తి బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ నిరాసక్తంగా కనిపించిందని, అది ఉత్తుత్తి బడ్జెట్ అని జీవీఎల్ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌ ప్రసంగం జగనన్న స్తుతిలా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రం తమవని చెప్పుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికి సరిపోయేలా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలు నవ్యాంధ్ర కలను నీరు గార్చేలా ఉన్నాయని, కులాల కార్పొరేషన్ల నిధులు వారికి చేరడం లేదని జీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు. కార్పొరేషన్లకు నిధులిచ్చే చిత్తశుద్ది ఏపీ ప్రభుత్వానికి లేదని, కనీసం టీ తాగేందుకు కూడా అక్కడ డబ్బులు లేవని ఆయన ధ్వజమెత్తారు. రైల్వే ప్రాజెక్టుల ప్రస్తావన బడ్జెట్‌లో ఎందుకు లేదు? రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ వాటా ఎందుకు ఇవ్వలేదు? కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులేవి? అంటూ జీవీఎల్ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. బడ్జెట్‌ను పార్టీ మేనిస్టోలా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈనెల 19న కడపలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. ప్రభుత్వం బడ్జెట్‌లో రాయలసీమకు మొండిచేయి చూపడం, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బోర్డ్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ పార్టీ నాయకులూ బీజేపీలో చేరే అవకాశముందని చెప్పారు. కేసీఆర్ నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు మీదా జీవీఎల్ స్పందించారు. మూడో కూటమి కాదు… టీఆరెస్‌కు మూడిందని దుయ్యబట్టారు. మంచి మెజార్టీతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రానుందని ఆయన జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement