హైదరాబాద్, ఆంధ్రప్రభ: అసెంబ్లి ఎన్నికల కార్యచరణ లో అధికార బీఆర్‌ఎస్, చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ దూకుడుగా ఒక అడుగు ముందే ఉన్నా తెలంగాణ బీజేపీ మాత్రం సైలంట్‌గా ఇన్‌సైడ్ వర్క్‌ను వ్యూహాత్మకంగా చేసుకుం టూ పోతోంది. ప్రత్యేక వ్యూహంతో అధికార బీఆర్‌ఎస్‌ను అటాక్ చేయాలని చూస్తోంది. ఏకకాలంలో ఆందోళనలు, సభలు, బూత్ కమిటీల బలోపేతంతోపాటు చేరికలను ప్రోత్సహిస్తూ చతుర్మక వ్యూహంతో ముందుకు వెళుతోంది. ఆందోళనలు, సభలు, బూత్ కమిటీల బలోపేతం, సోషల్ మీడియాలో ప్రచారం ఇలా ఒకే సమయంలో నాలుగు విధాలుగా ప్రజల్లోకి బీజేపీని తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ చతుర్మక వ్యూహంతో అసెంబ్లిd ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారాన్ని సరికొత్త విధానంలో ముందుకు తీసుకెళు తోంది. సోషల్ మీడియాలో అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలను తనదైన శైలిలో ఆదుకోవాలని ప్రణాళిక రచించింది. ఇందు కోసం పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను ప్రత్యేకంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేతిలో పార్టీ పెట్టింది. రెండు రోజుల క్రితమే పార్టీ సోషల్ మీడియా విభాగం సమావేశాన్ని నిర్వహించిన ఎంపీ అరవింద్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఎలా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేశారు.
ఇక ప్రజా సమస్యలపై ఆందోళనల్లో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముట్టడితోపాటు సెప్టెంబరు 7న ఛలో హైదరాబాద్ పిలుపుతో రాజధానిని దిగ్భంధించేందుకు బీజేపీ సిద్ధమైంది. తద్వారా అరెస్టు, లాఠీ చార్జీలు, వేధింపులకు వెరవకుండా ప్రజల పక్షాన పోరాడుతున్నామన్న భరోసా ను ఓటర్లలో కల్పించనుంది. అదే సమయంలో ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలను తెలంగాణలోని నియోజకవర్గాల్లో మోహరించి పార్టీ బలాబలాలతోపాటు ప్రత్యర్థి పార్టీల స్ట్రెంత్‌ను కూడా అంచనా వేస్తోంది. పోలింగ్ బూత్‌స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఈ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ నెల 27న ఖమ్మంలో బీజేపీ నిర్వహించబోయే బహిరంగసభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ సభా వేదికగా పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని ఇప్పటికే ప్రకటించిన కాషాయ పెద్దలు అసెంబ్లిd ఎన్నికల వేళ రాజకీయాలను హీటెక్కించారు. దాదాపు 22 మంది ముఖ్యనేతలు బీజేపీలో చేరనున్నారని, ఎవరెవరు చేరుతారో ఈ నెల 27న చూడాలని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్ కూడా ప్రకటించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ అసంతృప్తులు మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావుతోపాటు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును బీజేపీలోకి రప్పించేలా కమలనాథులు రంగంలోకి దిగినట్లు సమాచారం.
మరోవైపు వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు రాష్ట్రం లో పర్యటించి ఇచ్చే నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ పార్టీ సీనియర్లంతా అసెంబ్లి ఎన్నికల బరిలో ఉండాలని హై కమాండ్ నుంచి ఆదేశాలు కూడా అందాయి. పార్టీ నిబంధనల ప్రకారం కసరత్తు చేశాక తొలి విడత అభ్యర్థుల జాబితాను ఈ నెలాఖరును ప్రకటిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ ప్రకటించారు.